 
															జీజీహెచ్‌లో దొంగల భయం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో దొంగల భయం వెంటాడుతోంది. మంగళవారం ఇద్దరు నిందితులను ఆస్పత్రి సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో రాజేశ్ అనే పేషెంట్ కేర్ సిబ్బంది తన మొబైల్ పక్కన వెట్టి ఓ పేషెంటుకు సేవలందిస్తున్న క్రమంలో, ఓ నిందితుడు ఆ ఫోన్‌ను తీసుకుని పారిపోయాడు. నిందితుడిని స్థానిక కల్లు కంపౌండ్‌లో ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితున్ని పోలీసుకు అప్పగించారు. మరో నిందితుడు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ల వాహనాలను చోరీ చేస్తున్నట్లు, ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఓ పేషెంట్ బంధువు వాహనాన్ని చోరీ చేసిన నిందితుడు, దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పార్కింగ్ చేశాడు. మరో వాహనాన్ని కూడా చోరీ చేయడానికి ఆస్పత్రికి వచ్చిన నిందితుడు, ఓ బైక్ తాళం తీయడానికి ప్రయత్నం చేస్తుండగా, అనుమానం వచ్చిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని తనిఖీ చేశారు. అతనివద్ద డూప్లికేట్ బైక్ కీలతోపాటు ఏటీఎంలు ఉండడంతో గట్టిగా నిలదీయడంతో వాహనాలను చోరీ చేస్తున్నట్లు చెప్పడంతో అతన్ని కూడా వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బంది మల్లేశ్, సాయి, రాజేంద్రప్రసాద్, రాజేశ్, సాయిని ఆస్పత్రి అధికారులు అభినందించారు.
ఇద్దరిని పోలీసులకు అప్పగింత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
