 
															దళితుడైనందునే కేసు నమోదు చేయలేదు
కరీంనగర్ టౌన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దళితుడైనందునే అతనిపై దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిపై 23 రోజులవుతున్నా ఇంతవరుకు కేసు పెట్టలేదని, మానవ హక్కుల కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దేశంలో దఽళితులపై దాడులు జరిగితే వారికి రాజ్యాంగం, చట్టాలు సమానంగా పని చేయడం లేదని తెలిపారు. సుప్రీం కోర్టులో ఎస్సీ రిజర్వేషన్ అమలు కావడం లేదని, గవాయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే రిజర్వేషన్ అమలు చేశారని దీనిని కూడా అగ్రవర్ణాలు జీర్ణించుకోలేదని ఆరోపించారు. నిజామాబాద్‌లో రియాజ్ విషయంలో స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో స్పందించక పోవడం రాజ్యాంగ ఉల్లంఘన చేయడమేనన్నారు. నవంబర్ 1న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు దఽళితులు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు, ఎంఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌తో పాటు బోయిని కొమురయ్య, బిక్కి మురళీకృష్ణ, చెంచాల నవీన్, కొత్తూరి రాజన్న, తడగొండ శంకర్, చిలుముల రాజాయ్య తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
