సేద్యం.. ఆరోగ్యం.. ఆదాయం
నాన్న స్ఫూర్తితో..
మూడెకరాలు.. పది పంటలు
సిరిసిల్ల: సిరిసిల్ల శివారులోని పెద్దబోనాలకు చెందిన రైతు దొంతుల బాలరాజు మూడెకరాల్లో పది రకాల కూరగాయలు పండిస్తున్నాడు. బాలరాజుది నేతకార్మిక కుటుంబం. వాళ్ల తాతలు మగ్గం నేశారు. వస్త్రపరిశ్రమలో బతుకుదెరువు లేక బాలరాజు తండ్రి చంద్రయ్య వ్యవసాయం చేశాడు. తండ్రి బాటలో పయనిస్తూ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యవ‘సాయం’ సాగిస్తున్నాడు. ఐదో తరగతి వరకు చదువుకున్న బాలరాజు మూడెకరాల ఎర్రభూమిలో పూదీనా, క్యాబేజీ, టమాటా, వంకాయ, మిర్చి, పచ్చకూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతి సాగు చేశాడు. మరోవైపు బహువార్షిక పంటలైన కరివేపాకు, జామా, మామిడి, నిమ్మ చెట్లను పెంచాడు. ఒక్కో పంటను రెండు నుంచి ఐదు గుంటల విస్తీరణంలో వేస్తాడు. కాలానుగుణంగా మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ఆయా పంటలు వేసుకుంటున్నాడు. పట్టుదలే పెట్టుబడిగా బాలరాజు నిత్యం వ్యవసాయ క్షేత్రంలోనే తల్లి, భార్యతో కలిసి శ్రమిస్తున్నాడు. భూసారాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ ఎరువులు వేస్తూ మంచి దిగుబడి సాగిస్తున్నాడు. నిత్యం తన పొలంలో ఓ నలుగురు కూలీలకు పని కల్పిస్తున్నాడు. ట్యాలీఆటో కొనుగోలు చేసి హోల్‌సేల్‌గా ఫంక్షన్లకు కూరగాయలు సరఫరా చేస్తాడు. తాను పండించిన కూరగాయలను సిరిసిల్ల మార్కెట్‌లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు.
కూరగాయల పంటలు తక్కువ రోజుల్లో చేతికి వచ్చి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. వ్యవసాయంలో నాన్న చంద్రయ్యనే స్ఫూర్తి. ఆయన 25 ఏళ్ల కిందటే అనేక రకాల పంటలను సాగు చేసి మాకు బాటలు వేశారు. ఇప్పుడు అదే భూమిలో కూరగాయలు పండించడం, మార్కెట్లో అమ్ముకోవడంతో వ్యాపారం బాగుంది.
– దొంతుల బాలరాజు, రైతు, పెద్దబోనాల
సేద్యం.. ఆరోగ్యం.. ఆదాయం


