ఆడనా.. అయితే తీసేయ్!
తనిఖీలు చేస్తున్నాం
జిల్లాలో గుట్టుగా స్కానింగ్ సెంటర్లు
ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారు
గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు
స్కానింగ్ సెంటర్లపై వైద్యారోగ్యశాఖ దృష్టి
జిల్లాలోని ఓ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.. కొడుకు కావాలని మూడో సంతానం కోసం ప్రయత్నించారు. ఐదో నెల గర్భంలోనే ఎవరనేది చెబుతారని ఓ ఆర్‌ఎంపీ వారికి సలహా ఇచ్చాడు. దంపతులను తీసుకొని జిల్లాకేంద్రానికి వచ్చాడు. తెలిసిన స్కానింగ్ సెంటర్‌లో లింగనిర్ధారణ చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్‌కు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకే ప్రమాదమనే వైద్యుల సూచనలతో ఆలోచనను విరమించుకున్నారు.
‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక’ అంటూ కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల స్వయంగా ఓ గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పాడారు. ఈ సృజనాత్మక ప్రయత్నం లింగహింస, అక్రమ లింగ నిర్ధారణ, ఆడ శిశు హత్య– శిశు హత్యలపై అవగాహన పెంపొందించడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఆడపిల్ల గొప్పతనం.. ఆడపిల్లను బతకనిద్దాం.. మంచి జీవితాన్నిద్దాం అంటూ సారాంశంగా వివరించారు. ప్రతీ ఒక్కరు ఆడపిల్లకు మంచి చదువునివ్వాలని సూచించారు.
స్కానింగ్ సెంటర్లు: 195
మూసివేసినవి: 53
నిర్వహిస్తున్నవి: 142
ప్రైవేటు ఆస్పత్రులు: 286
మెడికల్ కళాశాలలు: 02
కరీంనగర్: సాంకేతిక పరిజ్ఞానంతో సమానంగా పరిగెడుతున్న కాలంలో ఆడపిల్లపై ఇంకా వివక్ష తగ్గడం లేదు. ఉన్నత చదువులు చదువుకున్నా.. ఆడపిల్ల అంటే అలుసుగానే చూస్తున్నారు. మగవారితో సమానంగా చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా.. తల్లి గర్భంలోనుంచి భూమిపై అడుగు పెట్టనివ్వడం లేదు. అమ్మ ఎదపై ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ‘ఆడబిడ్డను బతకనిద్దాం.. బతుకునిద్దాం’ అని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పురావడం లేదు. జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. గర్భంలోనే చిదిమేస్తున్నారు.
వరుసగా తనిఖీలు
జిల్లా వైద్యారోగ్యశాఖ స్కానింగ్ సెంటర్లలో వరుస తనిఖీలు చేస్తోంది. పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇస్తోంది. అయినప్పటికీ అబార్షన్ల దందా ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటున్న కొందరు డబ్బు కు దాసోహమై కడుపులోని ఆడబిడ్డలను కడతేరుస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే అక్రమ దందాకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు ఒడిగడుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కడుపులోనే చిదిమేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
గుట్టు చప్పుడు కాకుండా
పల్లెలు, పట్టణాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీల సహకారంతో జిల్లాలో లింగ నిర్ధారణ దందా సాగుతోందని సమాచారం. కొంతమంది ఆర్‌ఎంపీలు మగపిల్లాడి కోసం ఎదురుచూసే అమాయకులను మభ్యపెట్టి ధనార్జనే ధ్యేయంగా స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లకు పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. తెలంగాణ సామాజిక ఆర్ధిక నివేదిక ప్రకారం ప్రతి 1,000 మంది మగశిశువులకు జిల్లాలో 946 మంది ఆడశిశువుల జననాలు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. మగవారికి అధిక ప్రాధాన్యమివ్వడం, భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలతో ఈ అంతరం పెరుగుతోంది.
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలుచేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. సమాధానాలు ఇవ్వకపోతే సీజ్ చేస్తున్నాం. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ,
డీఎంహెచ్‌వో, కరీంనగర్


