నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. కపాస్ కిసాన్ యాప్ ద్వారానే విక్రయాలు జరిగేలా పక్కా చర్యలు చేపట్టింది. శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమి టీ పరిధిలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. వైభవ్ కాటన్ కార్పొరేషన్, ఆదిత్య కాటన్ ఆయిల్ ఆగ్రో టెక్ ఇండస్ట్రీస్, సరిత కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబో ద్దీన్ ప్రారంభించనున్నారు. రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తేవాలని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు వివరించారు. స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే కొనుగోలు చేయరని, స్లాట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులున్నా, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోయినా దగ్గరలోని ఏఈవో లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీని సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయగా రైతులు కనీస మద్దతు ధర రూ.8110 పొందాలంటే పత్తిలో 8శాతం తేమ మించకుండా చూసుకోవాలని కోరారు. తేమ 12శాతం కన్నా ఎక్కువుంటే సీసీఐ కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కు అనుసంధానం కలిగిన సెల్‌ఫోన్ వెంట తేవాలని సూచించారు.
జమ్మికుంటలో క్వింటాల్ పత్తి రూ.7,100
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,100 పలికింది. గురువారం 124 వాహనాల్లో 1,040 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.6,700, కనిష్ట ధర రూ.6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు.


