ఈ నీరు తాగితే రోగాలే..
రంగుమారి, దుర్వాసన వస్తున్న నల్లానీరు
తవ్వకాలు జరిపినా.. దొరకని లీకేజీ
మానకొండూర్ మండలం వన్నారంలో తాగునీటి కష్టాలు
మానకొండూర్: మానకొండూర్ మండలం వన్నారం గ్రామంలో నెలరోజులుగా నల్లానీరు రంగుమారి, దుర్వాసన వస్తోంది. తాగేందుకు బోరు, బావినీరు లేకపోవడంతో నల్లానీరే దిక్కవుతోంది. కొద్దిరోజులుగా వ్యర్థాల వాసన వస్తుండగా.. ఆ నీరు తాగితే రోగాలపాలై ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులకు చెప్పినా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామం నుంచి గంగిపల్లికి వెళ్లే దారిలో పోచమ్మ వీధి(4వవార్డు)లో 30 నివాస గృహాలున్నాయి. 200మంది వరకు చిన్నా, పెద్దలుంటారు. ఈ వీధిలో తాగేందుకు నల్లానీరు తప్పా వేరే ఆధారం లేదు. నెలరోజులుగా నల్లానీటిలో మలం వాసన, ఆనవాళ్లతో పాటు, వ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయాన్ని గ్రామ కార్యదర్శికి తెలపగా.. ఎక్కడైనా నల్లానీరు లీకేజీలు ఉన్నాయా..? అని పలుచోట్ల తవ్వకాలు చేపట్టారు. అయినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. నెలరోజులుగా నీరు తాగడం లేదని, కనీస అవసరాలకు కూడా ఉపయోగించే పరిస్థితి లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. కొందరు వాటర్ ప్లాంట్ నుంచి నీరు తెచ్చుకుంటుండగా.. వృద్ధులు, మరికొందరు నల్లానీరే తాగుతున్నారు. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు స్పందించి నూతన పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతాయని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.


