
టార్గెట్.. అర్బన్ బ్యాంక్!
సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు
ఊపందుకున్న రాజకీయ పార్టీల కసరత్తు
హస్తగతమా.. కమలపరమా!
వేచిచూసే ధోరణిలో బీఆర్‌ఎస్
రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ
రాష్ట్రం ఏర్పాటు తరువాత ఇదే తొలి ఎన్నిక
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
కరీంనగర్ అర్బన్ బ్యాంక్‌పై ఏజెండా ఎగరనుంది. మళ్లీ హస్తగతమేనా? కమల వశమా? పద్మవ్యూహంలో అభిమన్యుడిలా బీఆర్‌ఎస్ పరమా? అన్నది మరో 13 రోజుల్లో తేలనుంది. రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతుండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు మాటలకు పదును పెడుతున్నాయి. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సదరు వ్యూహంలో ఉండగా బీఆర్‌ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని స్పష్టమవుతోంది. అయిదేళ్ల పదవీ కాలానికి జరిగే ఎన్నికలు కావడంతో డైరెక్టర్లుగా గెలిచేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నాయి.
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఏర్పడిన నుంచి కాంగ్రెస్ అధిపత్యమే నడుస్తోంది. ఇతర పార్టీలు పెద్దగా ఆసక్తి చూపకపోగా కాంగ్రెస్ నేతలే పరిపాలిస్తున్నారన్నది సుస్పష్టం. కాంగ్రెస్‌లో కొత్త, పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరగా కోర్టు వరకు చేరిన విషయం విదితమే. తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ అక్రమాలకు పాల్పడ్డారని, ఇబ్బడిముబ్బడిగా సభ్యత్వాలిచ్చారని విలేకరుల సమావేశాల్లో వెల్లడించారు. సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి రాజశేఖర్‌తో పాటు పలువురి సభ్యత్వాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. రాజశేఖర్ కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం చేరగా మొదటి నుంచి పార్టీలో క్రీయాశీలపాత్ర పోషిస్తున్న తనకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విలాస్‌రెడ్డి అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేస్తుండగా తన ప్యానెలే కాంగ్రెస్ ప్యానలని చెబుతున్నారు. రాజశేఖర్ కూడా తన ప్యానల్‌ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారే తప్పా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గతంలోనే ప్రకటించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఇతర పార్టీలకు లాభించే అవకాశాలున్నాయి.
అభ్యర్థుల ఎంపికలో భాజపా
ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్‌తో సమావేఽశమైన నేతలు అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టంచేయగా ముఖ్య నేతలంతా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్‌లో వర్గపోరు పార్టీకి ప్రయోజనం చేకూర్చనుండగా భాజపా గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ బ్యాంకులో 9,287మంది ఓటర్లుండగా కరీంనగర్‌లో 7,272 సభ్యత్వాలుండగా జగిత్యాలలో 2,015 మంది ఓటర్లున్నారు. ఇందులో గరిష్టం భాజపా వైపే మొగ్గుచూపుతారన్నది భాజపా నేతల వాదన. మాజీ మేయర్ డి.శంకర్, కన్న కృష్ణ తదితర నేతలు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ దూరమా?
అయితే అర్బన్ బ్యాంకు ఎన్నికలను బీఆర్‌ఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు దూరమా.. వ్యూహాత్మక మౌనమా అన్న చర్చ మొదలైంది.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు రాష్ట్రం ఏర్పడకముందు జరగగా రాష్ట్రం ఏర్పడిన నుంచి ఎన్నికలు జరగలేదు. అవే పాలకవర్గాలు కొనసాగుతూ రాగా పాలకవర్గం బీఆర్‌ఎస్ వైపు చేరడంతో ఎన్నికలు నిర్వహించలేదు. నామినేటేడ్ విధానంలో పాలకవర్గాలను ప్రకటించారు. తెలంగాణలో తొలిసారి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతుండగా రాజకీయ వేడెక్కింది. ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 21 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 1న పోలింగ్, 4లోపు పాలవకర్గ ఎన్నిక జరగనుండగా తదనుగుణ ఏర్పాట్లలో సహకార శాఖ తలమునకలైంది. పాలకవర్గంలో మొత్తం 12మంది డైరెక్టర్లను బ్యాంకు సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రతీ సభ్యుడు బ్యాలెట్ పేపర్ ద్వారా 12మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో మహిళలకు రెండు డైరెక్టర్ పదవులు కాగా మరొక స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ కేటగిరికి రిజర్వ్ చేశారు. మిగతా 9 స్థానాలకు ఓపెన్ కేటగిరిలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఒకే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించగా ఈ సారి మాత్రం మూడు కేటగిరిలకు మూడు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. ఓపెన్ కేటగిరికి తెల్ల బ్యాలెట్ పేపర్, మహిళా కేటగిరికి గులాబి రంగు బ్యాలెట్ పేపర్‌ను, ఎస్సీ, ఎస్టీ కేటగిరి కోసం నీలి రంగు బ్యాలెట్ పేపర్‌ను వినియోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు.