ధాన్యం మాయం.. పట్టని యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం మాయం.. పట్టని యంత్రాంగం

Oct 22 2025 7:18 AM | Updated on Oct 22 2025 7:18 AM

ధాన్యం మాయం.. పట్టని యంత్రాంగం

ధాన్యం మాయం.. పట్టని యంత్రాంగం

● ఏటా వెలుగుచూస్తున్న అక్రమాలు ● మొక్కుబడి కేసులే తప్పా కఠినచర్యలేవి? ● మొద్దునిద్రలో రైస్‌మిల్లర్ల సంఘం

రూ.కోట్లు పక్కదారి

జూన్‌ 28, 2024: జమ్మికుంట మండలం కోరపల్లిలో శ్రీమహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్‌, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్‌ మిల్లుల్లో వెలుగుచూసిన రూ.130 కోట్ల ధాన్యం కుంభకోణం వ్యాపార లోకాన్నే నివ్వెరపరిచింది. మిల్లరు బండారు శారద రెండు మిల్లులు నిర్వహిస్తుండగా ఽప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలింలించారు.

ఇటీవల హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లిలో రవిచంద్ర ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు చేయగా 32,207 క్వింటాళ్ల ధాన్యం కనిపించలేదు. వీటి విలువ రూ.6.68 కోట్లు. బోర్నపల్లిలోని విజయకృష్ణ మోడర్న్‌ రైస్‌మిల్లులో 238.04 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం కనిపించడంతో అధికారులే కంగుతిన్నారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రభుత్వమిచ్చే ధాన్యంతో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: రైస్‌మిల్లు ఉంటే చాలు పెట్టుబడి లేని దందా ఇది. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా మాయం చేస్తున్నారు. లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అప్పనంగా అమ్ముకుని రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకోగా ప్రభుత్వానికి మొండిచేయి చూపుతున్నారు. ఏటా ఈ దందా జోరుగా సాగుతుండగా అధికార యంత్రాంగం మొద్దునిద్ర నటిస్తోంది. కేసులు నమోదు చేసినా.. నోటీసులిచ్చినా ఎలాంటి జంకు లేకపోవడం.. కఠినశిక్షలు లేకపోవడమే కారణం. రాజకీయంగా ఏమైనా చేయగలమనే మ్మకంతో పాటు పలువురు నేతల హస్తం దన్నుగా నిలుస్తుంది. గతంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైనా కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లరును రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు జిల్లాలో తనిఖీలు చేస్తుండగా కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు నిగ్గు తేలుతుండగా అధికార యంత్రాంగ డొల్లతనాన్ని చాటుతోంది. కరీంనగర్‌కు చెందిన బడా వ్యాపారి కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

సీఎంఆర్‌తో మిల్లర్ల వ్యాపారం

మిల్లు కట్టుకుంటే చాలు వ్యాపారం ప్రభుత్వమే ఇస్తుండటంతో పక్కదారి పట్టిస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వమిచ్చే ధాన్యాన్ని మరాడించి అక్రమార్గంలో అమ్ముకుని సదరు లోటును రేషన్‌ బియ్యాన్ని కొనుగోలుచేసి భర్తీ చేస్తున్నారు. ఆయా సీజన్లలో ఇచ్చిన సుమారు 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అందించారు. ఇందులో 40 శాతానికిపైగా మిల్లర్లు సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది. గడువుల మీద గడువు పొడిగించడంతో వీరి వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వృద్ధులం, వ్యాధిగ్రస్తులం.. మాపై పీడీ యాక్ట్‌ పెట్టలేరు. పెట్టేది 6ఏ కేసు. దాంతో ఒరిగిదేం లేదని మిల్లర్లు బహిరంగంగా పేర్కొనడం వ్యవస్తలోని లోపాలకు తార్కాణం.

విల్లాలు.. ఎకరాల కొద్ది భూములు

అక్రమాలకు రుచిమరిగిన మిల్లర్లు భారీగా ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం వంటి పట్టణాల్లో విల్లాలు కొనుగోలు చేయగా ఉమ్మడి జిల్లాలో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు భారీ ఎత్తున స్థిరాస్తులు పెంచుకుంటుండగా పాలకులు.. యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరం. ఓ వ్యాపారి ప్రభుత్వ ధాన్యం అమ్ముకుని రూ.200ల కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది.

చప్పుడు చేయని రైస్‌ మిల్లర్ల సంఘం

ధాన్యం కేటాయింపులో రైస్‌మిల్లర్ల సంఘం మధ్యవర్తిత్వం వహిస్తుండగా సదరు సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఏటా అక్రమాలు తారాస్థాయికి చేరుతుండగా లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్ముకున్నారని తేలుతుండగా రైస్‌మిల్లర్ల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. అక్రమార్కులను సంఘం నుంచి బహిష్కరిస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో విఫలమవుతుంది.

జమ్మికుంట, హుజూరాబాద్‌, మానకొండూర్‌, సదాశివపల్లి, తిమ్మాపూర్‌, కరీంనగర్‌ రూరల్‌ చుట్టూ రైస్‌మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ వానకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొంటున్న ప్రభుత్వం, పైసా ఖర్చులేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) పేరిట సరఫరా చేసుంది. మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా నేరుగా ధాన్యాన్నే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి ఎదిగారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్‌ ప్రాంతంలోని 7 మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి అవాక్కయ్యారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఓ మిల్లరు అక్రమాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మిల్లులోనే దాదాపు నాలుగు లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement