
సిటిజన్ సర్వేలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని వివరించారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసమే సిటిజన్ సర్వే చేపట్టిందన్నారు. సర్వే ఈ నెల 25తో ముగుస్తుందని, www.telangana.gov.in, telangana rising అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
కరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్లు, వాట్సప్ గ్రూప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. నేరగాళ్లు వాట్సప్ గ్రూప్‌ల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను (ఆర్‌టీవో చలాన్ , టీఎస్ చలాన్ యాప్‌లు వంటివి) సర్యూలేట్ చేస్తున్నారని తెలిపారు. తెలియకుండా.. అనుమతిలేకుండానే ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ అకౌంట్‌నూ హ్యాక్ చేస్తున్నారని చెప్పారు. నకిలీ చలాన్, పీఎం కిసాన్ ఏపీకే, వివిధ ఫేక్ యాప్‌లు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవద్దన్నారు. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి ఫోన్ నుంచి ుు002ు డయల్ చేయాలని, ఏదైనా సమస్య తలెత్తితే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయాలన్నారు.
అయోడిన్‌తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
కరీంనగర్: అయోడిన్ మెదడు అభివృద్ధి, శరీర ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు సహకరిస్తుందని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. ప్రపంచ అయోడిన్ లోపం రుగ్మతల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రొగ్రాం ఆఫీసర్లు, ఆఫీస్ స్టాఫ్‌తో ప్రతిజ్ఞ చేయించారు. అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలన్నారు. అయోడిన్ లోపంతో గొయిటర్ (మెడ ఉబ్బరం), మానసిక మందగమనం (బుద్ధి తగ్గిపోవడం), బలహీనత, అలసట, గర్భిణిలు, మృతశిశువు జననం లేదా పిల్లల్లో వైకల్యం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు విప్లవశ్రీ, రవీందర్ రెడ్డి, సాజిద, సనజవేరియా, రాజగోపాల్, స్వామి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లో మేము సైతం
కరీంనగర్ టౌన్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిటైర్డు ఎంప్లాయీస్ నాయకులు పోటీచేస్తున్నారు. ఈమేరకు సోమవారం నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆ సంఘం నాయకులు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయానికి నిరసనగా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజ్ ఆధ్వర్యంలో 12 మంది నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్లు దాఖాలు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా మాల సంఘ నాయకులు మద్దెల రాజేందర్, రొడ్డ శ్రీనివాస్, తెగుట్ల రమేశ్ కుమార్ ఉన్నారు.
దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
విద్యానగర్(కరీంనగర్): ఉన్నత విద్య చదివే దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.సరస్వతి మంగళవారం తెలిపారు. దివ్యాంగులైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ నుంచి పీజీ వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, గాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా కోసం టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31 చివరి తేదీ అని తెలిపారు.

సిటిజన్ సర్వేలో భాగస్వాములు కావాలి