
తెరపైకి చల్లూరు సహకార సంఘం
వీణవంక: వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వీణవంక సొసైటీలో ఎక్కువ మంది రైతులు చల్లూరు కేంద్రంగా ఉండడంతో సొసైటీ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఈ విషయమై రెండు రోజుల్లో వ్యవసాయశాఖ మంత్రిని కలిసేందుకు వివిధ గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారు. వాణిజ్య, వ్యాపారకేంద్రంగా ఉన్న చల్లూరులో కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని 2018లోనే పాలకవర్గం తీర్మాణం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. 2023–24లో మళ్లీ తీర్మాణం పంపాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు నివేదిక ఇచ్చారు. వీణవంక సొసైటీ పాలకవర్గంలో ఉన్న ఓ వ్యక్తి చల్లూరును సొసైటీ చేయొద్దని ఒత్తిడి తేవడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది.
మంత్రిని కలవనున్న రైతులు
వీణవంక ప్రాథమిక సహకార పరపతి సంఘం పరిధిలో 26 గ్రామాలు.. 54వేల జనాభా ఉంది. వీణవంక సొసైటీలో సుమారు 4,500 మంది సభ్యులున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11మంది డైరెక్టర్లు ఉంటారు. 1,085 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ సొసైటీలో చల్లూరు, ఎల్బాక, గంగారం, మామిడాలపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. చల్లూరు సొసైటీ ఏర్పడితే మామిడాలపల్లి, చల్లూరు, గంగారం, ఎల్బాక, కోర్కల్, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, కిష్టంపేట, బొంతుపల్లి, ఘన్ముక్కుల, కోర్కల్ గ్రామాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. వీణవంకకు వెళ్లేందుకు దూరభారం తగ్గుతుంది. ఈ విషయాన్ని కొందరు రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మంత్రిని కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. వీణవంక సొసైటీ సీఈవో ప్రకాశ్‌రెడ్డిని ఈ విషయమై వివరణ కోరగా చల్లూరులో సొసైటీ కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు.