
అమరుల త్యాగాలు మరువలేనివి
కరీంనగర్‌క్రైం: పోలీసులు అమరవీరుల త్యాగాలు మరవలేనివని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఫ్లాగ్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. పండుగల సమయంలో కూడా పోలీసులు విధినిర్వహణలో ఉంటారని గుర్తుచేశారు. పోలీసు ఉద్యోగం సవాలుతో కూడుకున్నదన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవని.. విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. దేశరక్షణ కోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడే విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల పోలీసుకుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందన్నారు. ఈ నెల 31 వరకు పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమరవీరుల విగ్రహానికి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కలెక్టర్‌తో పాటు సీపీ ఇతర అధికారులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, భీంరావు తదితరులు పాల్గొన్నారు.