
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
విద్యానగర్(కరీంనగర్): కోటి వెలుగుల కాంతి.. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. నిశీధి నిశ్శబ్దాన్ని బాణసంచాతో బెదరగొట్టి చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే ఆ సంబరం దీపావళికే సొంతం.
వెలుగుల పండుగ
‘తమసోమా జ్యోతిర్గమయా’ అనే ఉపనిషత్ వ్యాక్యానికి ఆచరణరూపం దీపావళి. దీపావళి పర్వదినానికి యుగాల చరిత్ర ఉంది. ఇల్లంతటినీ దీపాలతో అలంకరించేది ఈ పండుగ రోజు మాత్రమే. ఆధునికత ఎంతో పెరిగినా దీపావళి రోజు ప్రమిదలో వత్తి వేసి నూనె పోసి ఆ దీపాల్నే వెలిగిస్తాం.
ఇతర దేశాల్లో దీపావళి
జపాన్‌లో కోరా నాగోషి పేరుతో దీపాల పండుగను పితృదేవతల సంస్మరణార్థం జరుపుతారు. చైనాలో హయివో హోవా పండుగలో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తారు. నేపాల్‌లో ఆహారం ఐదురోజుల పండుగ. మొదటిరోజు కాకుల పండుగ, రెండోరోజు కోతుల పండుగ, మూడోరోజు ఆవుల పండుగ, నాల్గోరోజు దీపాలు వెలిగించి బాణసంచా పేలుస్తారు. చివరిరోజు ఆడపడుచుల పండుగ. ఇజ్రాయిల్ వారి స్వాతంత్య్ర వీరుడు మెకాచ్చిన్ స్మృత్యర్థం హనుకా అనే దీపోత్సవం జరుపుతారు. ఈజిప్టులో ఓ సిరీస్ మరణానికి చిహ్నంగా ఇంటింటా దీపాలు వేలాడగడతారు. అమెరికాలో నవంబరు 1న హాల్‌వీన్ అనే పేర దీపావళి వంటి పండుగ జరుగుతోంది. క్రైస్తవులు జరుపుకునే క్యాండిల్ ఫెస్టివల్ దీపావళి లాంటిదే. ముస్లిం దేశాల్లోనూ దీపావళి పండుగ ఉన్నది. మహ్మద్ పైగంబరు నూతన సంప్రదాయాన్ని స్థాపించి మక్కాకు తిరిగి వెళ్లిన రాత్రికది సూచిక. దీనిని షబ్ ఎ బారత్ అంటారు. ఆ రోజు బాణసంచా పేల్చారట.
వివిధ రాష్ట్రాల్లో..
రాష్ట్రాల వారీగా దీపావళి గురించి చెప్పుకుంటే గుజరాత్‌లో లక్ష్మీపూజ, గణపతిపూజ, కర్నాటకలో బలిపాఢ్య పండుగ, బెంగాల్, ఒడిశాలో కాళీపూజ, శక్తిపూజ, ఇతర రాష్ట్రాల్లో గోవర్ధనపూజ, యమద్వితీయ, భయ్యదూజ్ పండుగలు దీపావళితోనే ముడిపడి ఉన్నాయి. దీపావళి ముందు రోజును నరక చతుర్దశిగా దీన్ని పిలుస్తున్నారు.
చిమ్మచీకట్లను పారదోలే పండుగ
నేడు దీపావళి