
అప్పు కింద రెండెకరాలు సేల్‌డీడ్
ఇబ్రహీంపట్నం: అవసరం కోసం అప్పు తీసుకున్నందుకు ఉన్న భూమిని సేల్‌డీడ్ చేసుకున్నాడో వడ్డీ వ్యాపారి. సదరు వ్యాపారి బాధలు భరించలేక బాధితుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఎలేటి సుజాత భర్త జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్‌పల్లికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఏడాది తర్వాత వడ్డీకి వడ్డీ కలిపి మొత్తం చెల్లించాలని వ్యాపారి డిమాండ్ చేశాడు. లేకుంటే భూమి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించాడు. దీంతో గ్రామశివారులో తనకున్న రూ.60లక్షల విలువైన 82 గుంటల భూమిని సేల్‌డీడ్ చేసి ఇచ్చారు. ఆ సమయంలో రూ.11 లక్షల అప్పు ఇచ్చినట్లు లెక్క చెప్పగా.. జనార్దన్ మాత్రం నెలనెలా వడ్డీ ఇచ్చినట్లు చెబుతున్నాడు. తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు చెల్లిస్తానని జనార్దన్ చెప్పగా.. సదరు వ్యాపారి రూ.10 వడ్డీ చొప్పున లెక్క చేసి రూ.25 లక్షలు కట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో జనార్దన్ శనివారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య, కుటుంబసభ్యులు వెంటనే మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై ఎస్సై అనిల్‌ను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.
మాజీ ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు