
టపాసులతో భద్రం
విద్యానగర్(కరీంనగర్): దీపావళి అంటేనే భిన్నమైన పండుగ. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాణాసంచా కాల్చడానికి ఉత్సాహం చూపుతారు. కాగా అతి ఉత్సాహంలో టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తతో ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఆస్పత్రుల పాలవుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగ్రత్తలు పాటించాలి.
భారీ శబ్దాల బాంబులు
ప్రస్తుతం దీపావళి అంటే బాంబులు, టపాసుల పేలుళ్లతో వీధులన్నీ దద్దరిల్లిపోతున్నాయి. హైడ్రోజన్, సుత్తిలీ, లక్ష్మి, శివాజీ, డబుల్ సౌండ్స్, త్రిబుల్ సౌండ్స్ వంటి పేర్లతో భారీ శబ్దాలు పుట్టించే బాంబులు తయారవుతున్నాయి. ఢాం.. ఢాం అంటూ పేలే బాంబుల మోతలతో చెవులు దిమ్మెక్కెతున్నాయి. పరిమితికి మించిన శబ్దాలను విని, కాలిన గాయాలకు చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఈ పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలతో పండుగను జరుపుకోవడం ఉత్తమం.
టపాసులు కాల్చడంలో జాగ్రత్తలు
– నాణ్యమైన బ్రాండ్లకు చెందిన బాణాసంచా కొనుగోలు చేయాలి. రాకెట్లు, ఆకాశంలోకి దూసుకెళ్లే టపాసులను గుడిసెలు, గడ్డివాములు లేని ప్రదేశాల్లో కాల్చాలి.
– కాకరకొవ్వొత్తులు, విష్ణు చక్రాలు, భూచక్రాల వంటివి శరీరానికి దూరంగా ఉంచి కాల్చడం మంచిది. రాకెట్లు కాల్చేటప్పుడు వాటిని సీసాలో పెట్టి నిటూరుగా ఉండేలా సరి చూసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. చిన్నారులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి.
అత్యవసర ఫోన్ నంబర్లు
ఫైర్ స్టేషన్ 101
అంబులెన్స్ 108
పోలీస్ కంట్రోల్ రూం 100