‘సాక్షి’పై కక్ష సాధింపు తగదు
కరీంనగర్: సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని, దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతీ పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ), సాక్షి మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి బి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ నకిలీ మద్యం, అవినీతి, ప్రజాసమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఏలేటి శైలేందర్‌రెడ్డి, రాజశేఖర్, సంపత్, రమణ, సతీశ్, గోపాలకృష్ణ, విజేందర్‌రెడ్డి, సతీశ్, కవికుమార్, వినయ్, సుధీర్, సుమంత్, నర్సింగ్, రాధాకృష్ణ, కిరణ్, మంద శ్రీనివాస్, ఆది రమణారావు, సిలివేరి మహేందర్, కొత్త సత్యం, పసుపులేటి శ్రీనివాస్, శ్రీనివాస్, మారుతి, బాలయ్య, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.


