వైద్యులు పనితీరు మార్చుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పనితీరు మెరు గు పరుచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి జిల్లా వైద్యశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల వారీగా ప్రసవాలు, ఎన్‌ఆర్సీ రిపోర్ట్, ఆరోగ్య మహిళ, ఎన్‌సీడీ రిపోర్ట్, డెంగీ కేసులు, శుక్రవారం సభ, టీబీ కేసులు, వ్యాక్సినేషన్, ఓపీ, ఐపీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో ఇమ్యునైజేషన్ పూర్తి కాకపోవడం, ప్రసవాల సంఖ్య తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిక్షయ్ పోర్టల్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేయిస్తే ప్రభుత్వ సాయం అందుతుందని పేర్కొన్నారు. పీహెచ్‌సీల్లో జరిగిన ప్రసవాలు, వైద్యం పొందిన రోగుల సంఖ్యతో నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు రాయవద్దని సూచించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, పీవో సనా పాల్గొన్నారు.


