ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

Oct 19 2025 6:25 AM | Updated on Oct 19 2025 6:25 AM

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

వారం రోజుల షెడ్యూల్‌ ఇదే...

రాయికల్‌: గుస్సాడీ.. గోండు ప్రజలకు అదో ఆత్మీయ వేడుక. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. దండారీ సంబరాలు ముగిసేవరకు గుస్సాడీలు ఒకే దగ్గర ఉంటారు. స్నానాలు కూడా చేయరు. నృత్యం చేసేవారు శరీరం మొత్తం బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ప్రత్యేకమైన పేర్లదండలు ధరిస్తారు. కుడి చేతిలో మంత్ర దండం పట్టుకుంటారు. వీరిని దేవతలు ఆవహిస్తారని.. మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని వారి నమ్మకం. సంతానం లేనివారు గుస్సాడీలను ఇంటికి ఆహ్వానించి అతిఽథి భోజనాలు వడ్డిస్తే సంతానం కలుగుతుందన్న భరోసా. మెడలో రుద్రాక్షలు, ఇతర గవ్వలతో కూర్చిన దండలు వేసుకుంటారు. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన కుంటే (కిరీటం) ధరిస్తారు. ఇది చిన్నచిన్న అద్దాలతో అందంగా అలంకరించి ఉంటుంది. కాళ్లకు గజ్జెలు కడుతారు. డప్పులు, బాజాలు, తుడుం మొదలైన వాయిద్యాల శబ్దాలకు గజ్జెల సవ్వడి చేస్తూ.. అడుగులు వేస్తూ చేతిలో మంత్రదండాన్ని కదలాడిస్తూ నృత్యాలు చేస్తారు. గూడెంవాసులు తిలకిస్తూ ఆనందంలో మునిగితేలుతారు. ఈ ఏడాది నిర్మల్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాల నుంచి సుమారు 500 మంది గిరిజనులు జగన్నాథ్‌పూర్‌కు దండారీ బృందంతో వచ్చారు. ఈ ఏడాది అతిథ్యం ఇచ్చిన గ్రామంలోని బృందం మరుసటి సంవత్సరం అతిథ్యం స్వీకరించిన గ్రామానికి తరలివెళ్తుంది. బృందంలోని కొంద రు విజయసూచికగా పుతికట్టు (పోత్తి) ధరిస్తారు. ఈవిధంగా ఒక్కోగోండు గ్రామం కనీసం నా లుగైదు గ్రామాలతో సంబంధాల కొనసాగిస్తుంది.

ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం..

దూరంగా ఉండే గిరిజన గూడాల్లో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలన్న ఆకాంక్ష, పెళ్లి సంబంధాలు కుదర్చడానికి ఈ వేడుకను వేదికగా చేసుకుంటున్నారు. దీపావళి ఉత్సవాల్లో ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 50 మంది నుంచి 100 మంది పురుషులు గుస్సాడీ నృత్య వేషధారణ వేస్తారు. వీరిలో ఇద్దరు ఆడవేషంలో ఉంటారు. తమ దేవతైన ఏత్మాను తీసుకుని మరో గూడెంకు వస్తారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసే వారితోపాటు వచ్చిన వారు గూడెంలో తమ తెగలకు కుదిరే అమ్మాయిలు, అబ్బాయిల సంబంధాల విషయమై ఆరా తీస్తారు. రెండు గ్రామాల ఏత్మా దేవతలను ఒకచోట చేర్చి పూజలు నిర్వహిస్తారు.

వాయిద్యాలే వారి దేవతలు

గిరిజన గూడాల వారు డోలు వాయిద్యాలను ఆరాధ్యంగా పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. గుస్సాడీ నృత్యాల్లో వాడే డోలు వాయిద్యాలన్నింటినీ ఒకచోట చేర్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మొత్తంగా గిరిజన తెగలు ఇప్పటికీ సంప్రదాయాలు, ఆచారాలు పాటించడం గమనార్హం.

గోండులను కలుపుతున్న దీపావళి

జగన్నాథ్‌పూర్‌లో గుస్సాడి వేషధారణలు

తరతరాల సంప్రదాయం

మొదటిరోజు గ్రామదేవతలకు మొక్కి పూజలు నిర్వహించి వారం రోజుల పండగను ప్రారంభిస్తారు.

రెండోరోజు గిరిజనులు ఒక గ్రామం నుంచి మరో గ్రామాలకు వెళ్తారు.

మూడో రోజు గిరిజనులు వెళ్లిన గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గుస్సాడీ నృత్యాలు, గిరిజన మహిళలు కోలాటాలతో రోజంతా కోలాహలంగా గడుపుతారు.

నాలుగో రోజు గ్రామంలోని ఇంటింటికీ మంగళహారతులతో వెళ్లి పూజలు చేస్తారు.

ఐదోరోజు కుల పెద్ద ఇంటి వద్ద పూజలు చేసి విందు భోజనాలు ఆరగిస్తారు.

ఆరో రోజు కుల పెద్దకు ఇంటి దేవతను అప్పగిస్తారు.

ఏడో రోజు దీక్ష విరమణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement