ఆపదలో గల్ఫ్ వలస జీవి
● స్వగ్రామంలో కుటుంబీకుల ఆందోళన ● కోమాలోకి వెళ్లిన బడుగుజీవి
ముస్తాబాద్(సిరిసిల్ల): కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన బడుగుజీవి కోమాలోకి వెళ్లిన సంఘటన స్వగ్రామంలోని భార్యపిల్లలను ఆవేదనకు గురిచేస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన శివరాత్రి మధు ఏడాది క్రితం దుబాయ్ దేశానికి కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ కొద్దిరోజులు పనిచేసిన మధు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెలుగువారు మధును ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే మధు కోమాలోకి వెళ్లాడు. దీంతో స్వగ్రామంలో ఉన్న భార్య సువర్ణ భర్తను కాపాడుకునేందుకు అప్పు చేసి చికిత్సకు డబ్బులు పంపింది. మధు ఆరోగ్యం క్షీణించడంతో స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదిస్తే మధుకు మెరుగైన చికిత్స అందించాలంటే రూ.6లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారని భార్య సువర్ణ తెలిపింది. అంత డబ్బు తమ వద్ద లేదని వాపోయింది. మధుకు ముగ్గురు కుమార్తెలు నవ్య, రాణి, ప్రియాంక. తమ కుటుంబానికి పెద్ద దిక్కును కాపాడాలని భార్య, పిల్లలు వేడుకుంటున్నారు.
సనాతన ధర్మ రక్షణతోనే మానవాళికి మేలు
మల్యాల: సనాతన ధర్మ పరిరక్షణతోనే విశ్వమానవాళికి మేలు చేకూరుతుందని, ఆలయాల రక్షణకు దత్తగిరి మహరాజ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు తెలిపారు. అవదూతగిరి మహరాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పురాతన ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించి, పూజించాలన్నారు. ఆలయ అర్చకులు పీఠాధిపతులను సన్మానించారు. ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్ స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో..
ధర్మపురి: అనంతరం పీఠాధిపతులు ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ రవీందర్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.
ఆపదలో గల్ఫ్ వలస జీవి
ఆపదలో గల్ఫ్ వలస జీవి


