వైన్స్ టెండర్లు తగ్గినయ్
గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టిన వైనం
17వ తేదీ వరకు 1,034 దరఖాస్తులు
గతేడాది ముందు రోజు వరకు 2,014
నేటితో ముగియనున్న గడువు
ఆఖరి రోజున పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎకై ్సజ్ వర్గాలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. శనివారంతో దరఖాస్తుల గడువు ముగుస్తుండగా.. శుక్రవారం సాయంత్రం వరకు 1,034 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో శుక్రవారం 615 మంది టెండర్లు వేశారు. 2023లో గడువు కంటే ఒకరోజు ముందు వరకు 2,014 దరఖాస్తులు రాగా.. చివరిరోజు 2,026 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4,040 దరఖాస్తుల ద్వారా రూ.80.80కోట్ల ఆదాయం సమకూరింది. శనివారం ఆఖరి రోజు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెద్దఎత్తున పెరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దగా దరఖాస్తులు ఎప్పుడూ రాలేదు. చివరి రెండు, మూడు రోజుల్లో పెరుగుతూ వస్తోంది. ఈసారి కూడా గతంలో లాగే గడువు సమీపిస్తున్నా కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి అదేవిధంగా పెరుగుతుందని ఎకై ్సజ్ వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఆఖరి రోజే లిక్కర్ కింగ్‌ల ఎంట్రీ
మద్యం వ్యాపారాన్ని ఏళ్ల తరబడి ఏలుతున్న లిక్కర్ కింగ్‌లు ఆఖరు రోజు ఎంట్రీ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు పలువురు గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడ.. ఏ షాపులకు టెండర్లు వేయాలని నిర్ణయించుకొని పార్ట్‌నర్లను ఎంచుకొని ఆఖరు రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు పాత వ్యాపారులు పెద్దఎత్తున దరఖాస్తులు చివరి రోజు చేసుకున్నారు. చివరి రోజైతేనే కలిసి వస్తుందని సెంటిమెంట్‌తో ఆఖరి రోజే వేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈసారి టెండర్ ఫీజు రూ.3లక్షలు చేయగా.. కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు డబ్బు విషయంలో ఆలోచించి పార్ట్‌నర్లుగా వేస్తున్నారు. పలువురు సింగిల్‌గా కాకుండా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది కొంత మొత్తాన్ని పెట్టుకొని వివిధ షాపులకు అధిక సంఖ్యలో టెండర్లు వేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శనివారంతో వైన్స్ టెండర్ల గడువు ముగియనుండడంతో చివరి రోజు పెద్దఎత్తున దరఖాస్తులు రానున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చివరిరోజు రానున్నట్లు తెలుస్తుండగా.. టెండర్ల గడువు పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నేడు మధ్యాహ్నం వరకు చూసి దరఖాస్తుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సర్కిల్ వైన్సులు దరఖాస్తులు
కరీంనగర్ అర్బన్ 21 321
కరీంనగర్ రూరల్ 26 298
హుజూరాబాద్ 17 119
జమ్మికుంట 16 115
తిమ్మాపూర్ 14 181


