
కాంగ్రెస్‌లో రచ్చరచ్చ
రసాభాసగా అభిప్రాయ సేకరణ
ఆశావహుల ఆధిపత్య పోరు
పలుమార్లు వాగ్వాదం, ఉద్రిక్తత
అర్ధాంతరంగా వెను దిరిగిన పరిశీలకుడు
కరీంనగర్‌కార్పొరేషన్: ప్రణాళిక లేని అభిప్రాయ సేకరణ, ఆశావహుల ఆధిపత్యపోరు, కొత్త, పాతల వాగ్వాదాలు, తలుపులు బద్దలు గొట్టడం, పదే పదే ఉద్రిక్తత.. వెరసి డీసీసీ కార్యాలయం కదనరంగాన్ని తలపించింది. కాంగ్రెస్ సంస్థాగత ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టించేందుకంటూ చేపట్టిన అభిప్రాయ సేకరణ కరీంనగర్‌లో రసాభాసగా మారింది. ఎవరి అభిప్రాయాలు సేకరిస్తున్నారో.. ఎవరివి తిరస్కరిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితుల్లో, మూకుమ్మడిగా చొచ్చుకొచ్చి తలుపులు విరగ్గొట్టడంతో అభిప్రాయ సేకరణను అర్ధాంతరంగా వదిలేసి, ఏఐసీసీ పరిశీలకుడు వెనుదిరిగారు.
ఆశావహుల బల ప్రదర్శన
డీసీసీ, సిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పార్టీనాయకుల అభిప్రాయాల మేరకే అధ్యక్షుల ఎంపిక ఉంటుందని అధి ష్టానం చెప్పడంతో ఆశావహులు బలప్రదర్శనకు దిగారు. తమకు అనుకూలంగా ఉన్న నాయకులతో పాటు ఆటోలల్లో జనాలను తీసుకొచ్చారు. కాస్త ఆలస్యంగా చేరుకొన్న డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ , జనాలను చూసి, ఇంతమందిని తరలించడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రసాభాస
ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మన్నె, పీసీసీ పరిశీలకులు ఆత్రం సుగుణ, సత్యనారాయణ మండల, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్ల నుంచి అభిప్రాయాలు తీసుకొంటామని ప్రకటించారు. కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని, పార్టీకి కార్యకర్తలు అవసరం లేదా అని నగరానికి చెందిన శంకర్, శ్యాం తదితరులు ప్రశ్నించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్ తదితరులు ‘పార్టీలోకి మీరెప్పుడొచ్చారు... నిన్నగాక మొన్నవచ్చి మాట్లాడుతున్నార’నడంతో, పాత, కొత్త నాయకులు నడుమ వాగ్వాదం చోటుచేసుకొంది. ఇరువర్గాలు వాగ్వాదం తీవ్ర రూపం దాల్చే సమయంలో పరిశీలకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గేట్‌కు తాళం.. బయటే ‘వెలిచాల’
డీసీసీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో పరిశీలకుడు అభిప్రాయాలు సేకరించారు. ఆశావహులంతా కార్యాలయంలో ఉండగా, పక్కనే ఉన్న ఇందిరాగార్డెన్‌లో వెలిచాల రాజేందర్‌రావు తన అనుచరులతో ఉన్నారు. ఎవరూ కార్యాలయానికి రాకుండా గేట్‌కు తాళం వేశారు. రాజేందర్‌రావు లోనికి వస్తాడని నాయకులు చెప్పినా, పోటీపడుతున్న అభ్యర్థులు రావద్దంటూ తాళం తీయలేదు. వెలిచాల అనుచరులు గేట్ వద్దకు చేరుకొని ‘లోన ఉన్న దొంగలు బయటకు రావాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, గేట్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. పీసీసీ పరిశీలకురాలు ఆత్రం సుగుణ అక్కడికి చేరుకొని, వెలిచాలను లోనికి రావాలని అభ్యర్థించారు. ‘వాళ్లంతా ఎందుకు లోపల ఉన్నారు. నన్ను ఎందుకు బయట ఉంచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రక్రియ జరిపించాలి. మా వాళ్లు పార్టీకి అవసరం లేదా..’ అంటూ వెలిచాల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయ మొదటి అంతస్తులో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ ఒక్కో నాయకుడి అభిప్రాయం సేకరిస్తుండగా, తీవ్ర జాప్యం జరిగింది. రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా నాయకులంతా గుంపుగా గదిలోకి చొరబడడంతో గది తలుపులు విరిగిపోయాయి. దీనితో అభిప్రాయ సేకరణను పూర్తి చేయకుండానే పరిశీలకుడు శ్రీనివాస్ వెనుదిరిగారు.
ఇంతకీ ఎవరి అభిప్రాయాలు
సంస్థాగత ప్రక్రియలో ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. బ్లాక్,మండల,నగర, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి సేకరిస్తామని ముందుగా ప్రకటించారు. నగరంలోని 66 డివిజన్‌లకు సంబంధించిన అధ్యక్షులమంటూ రావడంతో, వారిని ఎవరు నియమించారో తెలియని పరిస్థితి నెలకొంది. మాజీ కార్పొరేటర్లకు పిలవడం లేదంటూ వారిని వెనక్కి పంపించారు. కొన్ని గంటల తరువాత, మళ్లీ పిలిపించారు. వచ్చిన వాళ్లందరి అభిప్రాయాలు తీసుకొంటామంటూ తెల్ల కాగితాలు అందించారు. చాలా మంది అభిప్రాయాలు తీసుకోకుండానే వెనుదిరిగారు. తమకు మద్దతివ్వని నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండా కొంతమంది ఆశావహులు ఎత్తులు వేసినట్లు ప్రత్యర్థులు ఆరోపించారు. మొత్తానికి పోలీసుల పహారా మధ్యన కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ రచ్చరచ్చగా మారింది.

కాంగ్రెస్‌లో రచ్చరచ్చ