‘క్రిప్టో’ దందాపై పోలీసుల నిఘా | - | Sakshi
Sakshi News home page

‘క్రిప్టో’ దందాపై పోలీసుల నిఘా

Oct 16 2025 5:03 AM | Updated on Oct 16 2025 5:03 AM

‘క్రిప్టో’ దందాపై పోలీసుల నిఘా

‘క్రిప్టో’ దందాపై పోలీసుల నిఘా

జిల్లానుంచి పరారైన నిందితులు

వారి కోసం గాలిస్తున్న పోలీసులు

పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో రెండేళ్లుగా మెటాఫండ్‌ ప్రో, పలు కంపెనీల పేరుతో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని నమ్మించి మోసం చేసిన యాప్‌ నిర్వాహకులపై పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేయడంతో పాటు, మరికొంత మందిని విచారణ చేపడుతున్నారు. మెటా ఫండ్‌ పేరుతో మోసం చేసిన వ్యక్తులపై మొదట కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల పట్టణానికి చెందిన మరో వ్యక్తి సుమారు రూ.80.50 లక్షలు మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి.. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

విచారణలో వెల్లడవుతున్న పేర్లు

అరెస్ట్‌ అయిన వారితో పోలీసులు లోతైన విచారణ చేయడంతో చైన్‌ సిస్టమ్‌ దందా చేపట్టిన వారి రహస్యాలు బయటపడుతున్నాయి. అరెస్టయిన వారిలో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ పెట్టుబడుల్లో ప్రధాన పాత్ర పోషించిన సుమారు 12 మంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం. వీరంతా వందలాది మందితో సుమారు రూ.500 నుంచి రూ.800కోట్లు పెట్టుబడి పెట్టించారు. యాప్‌ మూసినప్పటి నుంచి తమ డబ్బులు చెల్లించాలని పెట్టుబడి పెట్టినవారు ఒత్తిడి పెంచడంతో వారికి బాండ్‌ పేపర్లు, చెక్కులు ఇచ్చారు. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో కొంత మంది పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నారు.

ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న బాధితులు

జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరిట, బినామీల పేరిట ఆన్‌లైన్‌ క్రిప్టో దందాలో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం వారు మోసపోయామని తెలుసుకున్నా.. ఫిర్యాదు చేసేందుకు మాత్రం జంకుతున్నారు. ఫిర్యాదు చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేపడతారని భయాందోళన చెందుతున్నారు. మోసపోయిన వారిలో ఒకరిద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. వారు కూడా ఫిర్యాదు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు

జిల్లాలో వేలాది మంది బాధితులు ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోవడంతో అసలైన యాప్‌ నిర్వాహకులను గుర్తించి బాధితులను ఆదుకోవాలని రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై పూర్తివిచారణ చేపట్టాలని రాష్ట్ర పోలీసు అధికారులకు విన్నవించారు. అసలు నిందితులను గుర్తించి వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు డబ్బు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement