స్వగ్రామానికి యువకుడి మృతదేహం
గంభీరావుపేట(సిరిసిల్ల ): మండలంలోని నాగంపేటకు చెందిన బిట్ల తేజ(24) దుబాయిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. నెల రోజుల తర్వాత మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. జీవనోపాధి కోసం 8 నెలల క్రితం తేజ దుబాయి వెళ్లాడు. నెల రోజుల క్రితం ఇంటికొస్తానని షాపింగ్ చేయడానికి బయటకు వెళ్లి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతికి కారణాలు తెలియలేదు.
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డుకు చెందిన వేల్పుల రమేశ్ (55)అనే కిరాణా వ్యాపారి బుధవారం విద్యుత్ షాక్ గురై మరణించాడు. భవనం పైఅంతస్తుకు ఇనుప నిచ్చెన తీసుకెళ్తుండగా.. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆయన షాక్‌కుగురయ్యాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మేకల కాపరి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్‌కు చెందిన చాట్ల శంకరయ్య(47) అనే మేకల కాపరి అనారోగ్యం బాధ భరించలేక బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. శంకరయ్య మేకలను కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదేళ్ల క్రితం కడుపునొప్పి, షుగర్, బీపీ వ్యాధుల బారిన పడ్డాడు. పలు ఆస్పత్రులు తిరిగి వైద్యం చేయించుకున్నాడు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వైద్యం కోసం చేసిన అప్పులు మిగిలాయి. భార్య లక్ష్మి మేకలను కాసేందుకు బుధవారం ఉదయం వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి వివరించారు.
మల్లాపూర్: మండలంలోని కొత్తదాంరాజుపల్లి శివారు గోదావరిలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై రాజు, సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారమిచ్చారు. నిర్మల్ జిల్లాకేంద్రం నుంచి జోరిగే మౌనిక కుటుంబ సభ్యులతో వచ్చి శవాన్ని గుర్తుపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్‌కు చెందిన జోరిగే గంగాధర్(35) నిర్మల్ జిల్లాకేంద్రంలో ఫుట్‌వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపు సరిగా నడవక అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇంట్లో చెప్పకుండా ఈనెల 8న బైక్‌పై వెళ్లిపోయాడు. 10న సోన్ బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన శవం కొత్తదాంరాజుపల్లి వద్ద ఒడ్డుకు చేరింది. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాలికపై అత్యాచారయత్నం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి యత్నించిన బూసెల్లి నగేశ్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. గ్రామానికి చెందిన బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సమీప బంధువైన నగేశ్ ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చైల్డ్‌లైన్ అధికారుల ద్వారా బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.
స్వగ్రామానికి యువకుడి మృతదేహం


