ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో సర్జరీలకు స్వస్తి
కరీంనగర్: శస్త్రచికిత్స లేకుండా, నొప్పి తెలియకుండా, వేగవంతమైన రికవరీతో వైద్యం అందించే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అందుబాటులోకి వచ్చాక శస్త్రచికిత్సలకు స్వస్తి పలికినట్టేనని సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ డాక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లోని యశోద హెల్త్ సెంటర్‌లో మాట్లాడారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సర్జరీలకు సరైన ప్రత్యామ్నాయమన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, క్లోటింగ్, బ్లీడింగ్, క్యాన్సర్లు, యూటరైన్ బ్లీడింగ్ తదితర రోగాల చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. కొన్నిసార్లు డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వల్ల గర్భాశయాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అయితే సాంకేతికత ద్వారా రక్తస్రావం జరుగుతున్న కచ్చితమైన స్థానాన్ని గుర్తించి, ఆ రక్తనాళాన్ని మూసేయడం సాధ్యమవుతుందన్నారు. బ్లాక్ అయిన నాళాలను తెరవడం, లీకై న నాళాలను మూసేయడం, మెదడులో రక్తపుగడ్డలను తొలగించడం వంటి సంక్లిష్ట చికిత్సను ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సులభంగా చేస్తోందని తెలిపారు.


