నిబంధనలు తూచ్
తనిఖీలు తుస్..
కరీంనగర్ అర్బన్: టపాసుల విక్రయాల్లో కాసులు పేలుతున్నాయి. నిబంధనలు విస్మరించి కరీంనగర్‌తో పాటు మానకొండూరు, హూజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో అనధికార గోదాంలలో ఇప్పటికే భారీస్థాయిలో నిల్వలు చేరాయి. నిషేధిత టపాసులు దుకాణాల్లో ఉండటం తనిఖీల డొల్లతనాన్ని చాటుతోంది. దీపావళి సమీపించడంతో టన్నుల కొద్ది టపాసులు దిగుమతి చేసుకుంటుండగా అడ్డుకట్ట వేసేవారే కరవయ్యారు.
పలు ప్రాంతాలు అక్రమాల అడ్డా
జిల్లాకేంద్రంలో కేవలం నాలుగింటికి శాశ్వత అనుమతి ఉండగా అనుమతిలేని దుకాణాలు పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఎవరైనా అటువైపు వెళితే పాత కాగితాలను చూపించడం.. తమకున్న పరపతితో బెదిరింపులకు గురిచేయడం వారి నైజం. దుకాణాల వెనుకాలే పెద్ద ఎత్తున టపాసులను నిల్వచేయడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం నెలకొంది. వాస్తవానికి విపరీతంగా జనం తచ్చాడే ప్రాంతంలో అనుమతి ఇవ్వరాదు. దుకా ణాన్ని బట్టి మూడేళ్లు, అయిదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా సదరు సందర్బాల్లో అధి కారులు వ్యాపార కేంద్రాలను పరిశీలించకుండానే అనుమతులిచ్చేస్తున్నారు. నగరంలోని ప్రకాశంగంజ్, మంకమ్మతోట, రాంనగర్, కోతిరాంపూర్, బొమ్మకల్, గణేశ్‌నగర్, తీగలగుట్టపల్లి, గణేశ్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా నిల్వ చేస్తున్నారు.
నిబంధనలు తూచ్
శాశ్వత ప్రతిపాదికన అనుమతి తీసుకున్న దుకాణాలు నిబంధనల ప్రకారం 1500 కిలోలు మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఒకవేళ అదనంగా కావాలనుకుంటే చైన్నెలో గల పేలుడు పదార్థాల నియంత్రణ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అదీ దీపావళికి వారం రోజుల ముందు వరకే అవకాశం. కానీ క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా నిల్వలు పెడుతున్నారు. ఒక్కో దుకాణంలో లక్షకిలోల నుంచి రెండు లక్షల కిలోల వరకు నిల్వలు పెడుతుండగా తనిఖీలు చేసే అధికారులే కరవయ్యారు.
ధరలు ఇష్టారాజ్యం
టపాసుల ధరల నియంత్రణలో అధికారులు విఫలమవుతున్నారు. రూ.4 విలువ చేసే వస్తువులను రూ.40కి విక్రయిస్తున్నారు. స్టాండర్డ్ కంపనీలు ఎంఆర్‌పీని సరిగా ముద్రిస్తుండగా చిన్న చిన్న కంపనీలు విక్రేతలకు అనుగుణంగా ధరలను ముద్రిస్తుండటంతో వ్యాపారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టపాసులను తమిళనాడు రాష్ట్రం నుంచి జిల్లాకు దిగుమతి చేసుకుంటుండగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల పన్నులను అక్రమార్గంలో ఎగ్గొడుతున్నారు. ఒకే వేబిల్లుపై ఎక్కువ టపాసులను దిగుమతి చేసుకుంటున్నారు.
డ్రాగన్ విక్రయాలకు వ్యూహం
చైనా డ్రాగన్ టపాసులను ప్రభుత్వం నిషేధించగా అక్రమంగా నిల్వ చేసిన సదరు టపాసులను విక్రయించేందుకు వ్యాపారులు పావులు కదుపుతున్నారు. దేశీయంగా ఉత్పత్తి అయిన వాటికన్నా చైనా ఉత్పత్తులు తక్కువ ధరకు లభించడం.. గిరాకీ ఎక్కువగా ఉండటంతో వీటినే విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. స్థానికంగా తయారైన టపాసు రూ.100కు లభిస్తే చైనా డ్రాగన్ టపాసు రూ.30కి లభిస్తుంది. ఎక్కువ లాభముండటంతో విలువలకు తిలోదకాలిస్తూ ప్రభుత్వ నిబంధనలను గాలికొదులుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. టపాసుల దుకాణాల నిర్వహణ విషయంలో కలెక్టర్ కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలి సమీపంలోని టపాసుల దుకాణమిది. వరంగల్ జిల్లాకు చెందిన వ్యాపారి దందా చేస్తుండగా ఇక్కడ జన సంచారం ఎక్కువే. ప్రతిసారి జనసంచారం గల ప్రాంతంలో దుకాణం నిర్వహించవద్దని చెప్పడం మొక్కుబడిగా సాగుతుందే తప్పా ఏటా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు.
నిబంధనలు తూచ్


