ఊహించని వారికి కూడా చాన్స్
కరీంనగర్ కార్పొరేషన్/తిమ్మాపూర్/గంగాధర: జిల్లా అధ్యక్షుడు అవుతామని ఊహించని వాళ్లను కూడా డీసీసీ అధ్యక్ష స్థానం వరించే అవకాశం సంస్థాగత నూతన ప్రక్రియలో ఉందని ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మన్నె అన్నారు. మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఎవరినో తెచ్చి అధ్యక్షులుగా నియమించే కాలం పోయిందన్నారు. కిందిస్థాయిలో పార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, పార్టీకి అంకితభావంతో ఉన్న వాళ్లకే పదవులు వస్తాయన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేస్తారో వారిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అభిప్రాయసేకరణ అనంతరం అధిష్టానానికి నివేదిక అందిస్తామని తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీలోని అరుంధతి కల్యాణ మండపంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమర్థులైన నాయకులను జిల్లా, బ్లాక్, మండలస్థాయిల్లో పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామన్నారు. వ్యక్తిగత విషయాలపై కాకుండా, పార్టీ కోసం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. గంగాధరలో మాట్లాడుతూ.. కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు అధిష్టానానికి పంపిస్తామన్నారు. పీసీసీ సమన్వయకర్తలు ఆత్రం సుగుణ, సత్యనారాయణ, మ్యాడం బాలకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ పాల్గొన్నారు.


