పరీక్షలు చేసి.. మందులివ్వాలి
కరీంనగర్‌టౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యకేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం ద్వారా వైద్యపరీక్షలు చేసి, అవసరం అయినవారికి మందులు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని సప్తగిరికాలనీ పీహెచ్‌సీలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్య పరీక్షలు చేసుకుంటున్న మహిళలతో మాట్లాడారు. ఆరోగ్య మహిళ పరీక్షల రికార్డు పరిశీలించారు. రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. గర్భిణులకు సిజేరియన్‌తో కలిగే సమస్యలను వివరించాలన్నారు. హెచ్‌బీ తక్కువ ఉన్న మహిళలకు ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఆరోగ్యకేంద్రం ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనంలో 2డీఎకో, ఎక్స్‌రే, మమ్మోగ్రఫి పరీక్షల తీరును పరిశీలించారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.


