మహిళా కాంగ్రెస్‌లో పోస్టుల లొల్లి
కరీంనగర్ కార్పొరేషన్: ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు కార్యాలయంలో ఉండగానే కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగిన ఘటన మంగళవారం డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకొంది. ఏఐసీసీ పరిశీలకుడి మీడియా సమావేశం తరువాత, నాయకులంతా కార్యాలయ మీడియా హాల్ నుంచి బయటకు వచ్చారు. కార్యాలయ ఆవరణలో ఉన్న మాజీ కార్పొరేటర్ గంట కల్యాణి భర్త గంట శ్రీనివాస్ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ము ల్కల కవిత, షబానా వాగ్వాదానికి దిగారు. ‘23వ డివిజన్ అధ్యక్ష స్థానానికి పేర్లు ఎవరివి పంపించావ్, నువ్వెలా పంపిస్తావంటూ’ ఆయనపైకి దూసుకెళ్లారు. ఒక దశలో నెట్టుకొన్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న సీనియర్ల పేర్లనే పంపించా మంటూ శ్రీనివాస్ బదులిచ్చారు. కవిత, షబానా తదితరులు మాట్లాడుతూ తమలాంటి సీనియర్లను విస్మరించి పార్టీలో పదవులు ఇస్తున్నారన్నారు. తన ను పార్టీ సంప్రదిస్తే కాంగ్రెస్‌లో సంవత్సరాలుగా ఉన్న ఇద్దరి పేర్లను ఇచ్చానని శ్రీనివాస్ తెలిపారు.


