
ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లో రాష్ట్రీయ సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగా యి. నగర స్వయం సేవకులు ఆదివారం భారీ కవాతు ప్రదర్శన చేపట్టారు. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి పలు ప్రాంతాల మీదుగా రాంనగర్ వరకు పథ సంచాలన్ కొనసాగింది. అనంతరం శ్రీచైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచాలన్ సమరోప్ జరిగింది. ముఖ్య వక్తగా విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి అయచితుల లక్ష్మణరావు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవాలంటే మత, రాజకీయ కోణాల్లో కాకుండా సంఘంలో చేరి పనిచేయాలన్నారు.
ఎయిమ్స్ తరహా ఆయుర్వేద ఇనిస్టిట్యూట్‌కు కేంద్రం సానుకూలం
తెలంగాణలో ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్‌కు తాను రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. కరీంనగర్‌లో అత్యాధునిక ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి ఏర్పాటుపై 2025 మే 27న రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణలో ఆయుర్వేద విద్యా, వైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇనిస్టిట్యూట్ ఏర్పాటును కేంద్రం పరిగణనలోకి తీసుకుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న ప్రచారం అసత్యమని ఖండించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని గుర్తుచేశారు.