
● ధాన్యం కేటాయింపులో నిబంధనలు కఠినతరం ● బకాయి చెల్లింపు
కరీంనగర్ అర్బన్: మొండి మిల్లర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించేవారికే సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వాలని నిర్ణయించగా అధికార యంత్రాంగానికి తదనుగుణ ఆదేశాలు జా రీ చేసింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి కొనే ధాన్యాన్ని బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్స్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) కింద కేటాయించనుండగా ఈ మేరకు కఠిన నిబంధనలు రూపొందించారు. కొందరు 2024– 25 యాసంగి సీజన్ నుంచి అధికారులు బ్యాంకు గ్యారంటీ తీసుకుంటున్నారు. మిల్లర్లు మాత్రం గ్యారంటీలు ఇవ్వలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిల్లర్లు అధికారులతో ఒప్పందం చేసుకొని బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయించాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించారు.
ఇక ఇవి పక్కా
మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని గోదాముల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఆరుబయట ఉంచరాదు. గోదాముల్లో మాత్రమే ధాన్యం నిల్వ చేసినట్లు ధ్రువీకరణ పొందాలి. వానాకాలం సీజన్ ధాన్యాన్ని పొందేందుకు మిల్లర్లు పౌరసరఫరాలశాఖతో ఒప్పందం చేసుకోవాలి. గతంలో కేటాయించిన ధాన్యానికి సంబంధించి సీఎమ్మార్ సవ్యంగానే ఇచ్చినట్లు ధ్రువీకరణ ఉండాలి.
తుది గడువు నవంబరు 12
2024–25 యాసంగి సీజన్లో జిల్లాలోని మిల్లులకు పౌరసరఫరాలశాఖ 2,71,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎమ్మార్ కింద తరలించింది. మిల్లర్లు ఇప్పటివరకు 1.62లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా బియ్యాన్ని అందించారు. మిగిలిన లక్ష మెట్రిక్ టన్నుల సరిపడా బియ్యం ఇవ్వాల్సి ఉంది. వచ్చే నవంబరు 12లోగా అందించాలని ఇప్పటికే గడువు విధించింది. కాగా బకాయిల్లేని మిల్లులకే సీఎమ్మార్ కింద ధాన్యం కేటాయిస్తామని, నిర్ణీత గడువులోగా మిగిలిన బియ్యం ఇవ్వాలని మిల్లర్లకు స్పష్టం చేశామని పౌరసరఫరాలశాఖ అధికారులు వివరించారు.