రియల్టర్ హత్య కేసులో మరొకరి అరెస్ట్
వేములవాడ: సిరిసిల్లకు చెందిన రియల్టర్ సిరిగిరి రమేశ్ హత్య కేసులో చిర్రం రవిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వేములవాడటౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వివరాలు వెల్లడించారు. చందుర్తిలోని భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్‌పై పెట్రోల్‌బంక్ కోసం చిర్రం రవి, సిరిగిరి రమేశ్‌కు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే పెట్రోల్‌బంక్ ఇవ్వకుండా, భూమి ని తిరిగి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. అంతేకాకుండా ఆ భూమి తనదేనంటూ విక్రయించేందుకు రమేశ్ ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న చిర్రం రవి భూమి దక్కాలంటే సిరిగిరి రమేశ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే ఎద్దండి వెంకటేశ్, వంశీలతో కలిసి ప్రణాళిక వేసుకున్నారు. గత నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు సిరిసిల్ల ప్రాంతంలోని పెద్దూరు సబ్‌స్టేషన్ సమీపంలో కారులో నిద్రిస్తున్న సిరిగిరి రమేశ్‌ను కదలకుండా అలా వంశీ పట్టుకోగా, చిర్రం రవి వెనుక సీట్లో నుంచి కదలకుండా బలంగా పట్టుకున్నాడు. డ్రైవర్ సీట్లో కూర్చున్న ఎద్దండి వెంకటేశ్ కత్తితో రమేశ్ గొంతులో, చాతిపై పొడిచి హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన ఎద్దండి వెంకటేశ్, అలా వంశీలను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై రాంమోహన్, సిబ్బంది తిరుపతి, సమీయుద్దీన్, రాజకుమార్, పాషా, గోపాల్‌కు రివార్డు అందించి అభినందించారు.


