
నేటినుంచి అమ్మవారి నవరాత్రోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ మండలం నగునూర్ శ్రీ దుర్గాభవానీ ఆలయంలో సోమవారం నుంచి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతూ సోమవారం ఉదయం గురు వందనం, గోపూజ, పుణ్యాహవాచనం, గ్రహారాధన, కలశస్థాపన, చండీపారాయణ చతుష్టష్యుపచారపూజ, చండీహోమం, మంగళహారతి, కన్యాసువాసినీ పూజలు జరుగుతాయని తెలిపారు. ఆమ్మవారు బ్రహ్మీ అలంకరణలో హంసవాహనంపై దర్శనమిస్తారని వివరించారు. సాయంత్రం బతుకమ్మ, పల్లకీసేవ, కోలాటం, రాజోపచార పూజలు జరుగుతాయని తెలిపారు. ప్రతీరోజు ఉదయం సాయంత్రం గంగాహారతి ఉంటుందన్నారు. 23న నందివాహనంపై మహేశ్వరీ అలంకరణలో, 24న నెమలివాహనంపై కౌమరీ అలంకరణలో, 25న గరుడవాహనంపై వైష్ణవి అలంకరణలో, 26న లలిత త్రిపుర సుందరిగా, 27న గజవాహనంపై ఇంద్రాణి అలంకరణలో, 28న రాజరాజేశ్వరిగా, 29న సరస్వతీ అలంకరణలో, 30న సింహవాహనంపై దుర్గామాతగా, 1న అన్నపూర్ణ దేవిగా, 2న విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, రాచమల్ల ప్రసాద్, పల్లెర్ల శ్రీనివాస్, తొడుపునూరి వేణుగోపాల్, రాచమల్ల రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.