
అ‘ధన’పు బాదుడు
కరీంనగర్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. పండక్కి నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు వస్తుంటారు. పండుగ తర్వాత తిరిగి వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కరీంనగర్ రీజి యన్‌లోని పదకొండు డిపోల నుంచి ఈనెల 20 నుంచి అక్టోబరు 13 వరకు 2,651 అదనపు ట్రిప్పులు నడిపిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ వరకు జేబీ ఎస్ నుంచి కరీంనగర్‌కు, 2వ తేదీ నుంచి 13 వరకు కరీంనగర్– జేబీఎస్ మధ్యలో ప్రత్యేక ట్రిప్పులు 50శాతం అదనపు చార్జీలతో నడిపించనున్నారు.
ప్రత్యేక బస్సులు 2,651
రద్దీకి అనుగుణంగా ఈనెల 20 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 1321 ట్రిప్పులు, అక్టోబరు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు 1330 ప్రత్యేక ట్రిప్పులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నా రు. టికెట్ ధర రూ.100 ఉంటే రూ.50 కలిపి రూ.150 చెల్లించాల్సి వస్తోంది. డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడ, తదితర బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.