
దుర్గామాతా.. నమోస్తుతే..
కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్(కరీంనగర్)/సుల్తానాబాద్/రామగిరి: అమ్మల గన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత. మూడు శక్తులకు ఆది దేవతైన అమ్మ.. త్రిశక్తి స్వరూపిణి. లోక రక్షణ కోసం పార్వతి, సరస్వతి, లక్ష్మి రూపాల్లో అవతరించి లోక కంటకులైన రాక్షసులను తన విశేషమైన శక్తియుక్తులతో సంహరించింది. సకల జగత్తుకు మూలం.. త్రిమూర్తులకు శక్తి ప్రదాత.. సకలాభీష్ట ప్రదాయిని అయిన దేవి నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమౌతాయి.
● నవరాత్రులు..
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారికి కలశ స్థాపనం చేసి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి విజయదశమి వరకు దేవీ నవరాత్రులు నిర్వహిస్తారు.
● 9 అవతారాలు
శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి అయిన దుర్గామాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అవతారాల్లో భక్తులు కొలుస్తారు.
● ప్రీతిపాత్రమైన రోజులు
భద్రకాళిగా ఎనిమిదో రోజు జన్మించిన చాముండి తొమ్మిదో రోజు వీరవిహారం చేసి దైత్య సంహారం చేసిందని పురాణాలు ప్రవచిస్తున్నాయి. పదోరోజు విజయలక్ష్మిగా జనుల ఆనందోత్సవాలకు ప్రతీకగా పూజలందుకుంటుంది. నవరాత్రుల్లో చివరి 3 రోజులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటినే మనం దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పేరిట ఉత్సవాలు జరుపుకుంటాం.
● శైలపుత్రి..
చైతన్య శక్తి శైలపుత్రి. త్రిమూర్తి స్వరూపిణి ఆది పరాశక్తి సతీదేవిగా యోగాగ్నిలో తనువు చాలించింది. తిరిగి మీనా–హిమవంతులకు శైలపుత్రీదేవిగా జన్మించింది. ప్రాకృతిక శక్తితత్వం శైలపుత్రి అవతారంలో దాగి ఉంది. శైలపుత్రి నంది వాహనంపై త్రిశూలధారిణిగా సీ్త్రశక్తిని లోకానికి తెలియజేసింది.
● బ్రహ్మచారిణి..
సంకల్ప బలం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణిగా ని యమనిష్ఠలతో తపస్సు చేసి శివుడిని వరించింది. చేతిలో కమండలంతో మాలధారిణిగా నిత్య తపో ముద్రాంకితగా దర్శనమిస్తుంది. ఈ రూపంలోని దుర్గాను ఆరాధించిన వారికి ఏకాగ్రత దీక్ష అలవడుతుంది.
● చంద్రఘంట..
మనసుకు మార్గదర్శి చంద్రఘాంటాదేవి. చంద్రక్రాంతిని సుధాపానం చేయడం వల్ల ఛిన్నమస్తగా రూపొందిన అంశ చంద్రఘంటాదేవి. ఈ రూపంలో ఈమెను ఆరాధించే వారికి శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి.
● కూష్మాండ..
సర్వదుఃఖహరిణి కుష్మాండ దుర్గ. శారీరక, మానసిక రుగ్మతలను పారదోలే రూపం కూష్మాండ దుర్గ. వర, అంకుశ, పాశ, అభయ ముద్రలతో కూడిన అష్ట భుజాలతో కోటి సూర్యప్రభలతో ప్రకాశించే జనని అభయ ప్రదాయిని.
● స్కందమాత..
మాతృదేవోభవ అనే సందేశాన్ని, అమ్మతత్వాన్ని మానవాళికి ప్రబోధంగా, మాతలకే మాత అయి శ్వేత వర్ణశోభితగా, ఆది మాతగా కుమారస్వామిని లాలించే రూపంలో వెలుగొందే దివ్యమూర్తి స్కందమాత.
● కాత్యాయని..
సృష్టి, స్థితి, లయలకు హేతువైన శక్తి. సకల సంసార బంధాలకు కారుకురాలు. భవసాగరాల నుంచి మానవుల్ని ఉద్ధరించే శక్తి. సింహ వాహనం అధిరోహించి కరవాలం చేబుని రాక్షసత్వాన్ని పారదోలే జగద్రక్షినిగా శోభిల్లుతోంది.
● కాళరాత్రి..
ప్రాణకోటి జీవితాల్లోని గ్రహ బాధలు తొలిగించి మృత్యువుకే భయం కలిగిస్తూ.. దుర్గుణాలు, దుష్ట శక్తులను పారదోలి సత్య కర్మల్ని ప్రేరేపిస్తూ మంచి బుద్ధిని పెంచుతుంది.
● మహాగౌరి..
మంగళ స్వరూపిణి మహాగౌరీ. ఆదిపరాశక్తి భయంకర కాళ స్వరూపాన్ని విసర్జించిన అమ్మవారు.. ధవళకాంతితో వెలిగిపోయే మంగళ స్వరూపిణిగా మహాగౌరీగా అవతరించింది. వృషభాన్ని అధిరోహించి.. తెల్లని వస్త్రాలు ధరించి.. త్రిశూలం చేబూని.. శతకోటి దివ్య కాంతుల్ని భక్తజన కోటికి అభయ ప్రదానం చేస్తూ శోభిల్లుతోంది.
● సిద్ధిధాత్రి..
మోక్షప్రదాత్రి సిద్ధిధాత్రి. భౌతిక జీవనంలో సర్వసిద్ధులూ అనుగ్రహించే సిద్ధిధాత్రి అద్వైత సిద్ధికి ప్రేరణనిస్తుంది. అష్ట సిద్ధులు, మోక్షం ప్రసాదిస్తుంది.
● అపరాజిత..
అపరాజిత శ్రీరాజేశ్వరీదేవి. సర్వశక్తికి కేంద్రస్ధానం జగజ్జననే. విజయదశమి రోజు దేవి శ్రీరాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది.
నేటి నుంచి దేవి నవరాత్రోత్సవాలు
9 రోజులు భక్తిశ్రద్ధలతో పూజలందుకోనున్న అమ్మవారు