పూల సాగు.. ఆదాయం బాగు.. | - | Sakshi
Sakshi News home page

పూల సాగు.. ఆదాయం బాగు..

Sep 22 2025 10:42 AM | Updated on Sep 22 2025 10:42 AM

పూల సాగు.. ఆదాయం బాగు..

పూల సాగు.. ఆదాయం బాగు..

సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు గిరాకీ

జిల్లాలో 100 ఎకరాల్లో బంతి, చామంతి, లిల్లీ

ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: చాలా గ్రామాల్లో రైతులందరూ ఒకే పంట సాగు చేసి.. ఆ పంటకు మార్కెటింగ్‌ లేదంటూ.. ధర రాలేదని దిగులు చెందుతుంటారు. కానీ కొంతమంది రైతులు మారుతున్న వినియోగదారుల ధోరణిని అర్థం చేసుకొని ఆ మేరకు ఆయా పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఓపెన్‌ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను అమ్ముకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే జిల్లాలోని యువ రైతులు పండుగల పూట దాదాపు 100 ఎకరాల్లో బంతి, చామంతి, లిల్లీ పూలు సాగు చేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

20 గుంటల్లో..

సాధారణంగా ప్రతీ గ్రామంలో రైతులందరూ వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తూ ఆదాయం రావడం లేదని మదనపడుతుంటారు. కానీ కొడిమ్యాల మండలం పూడూరు, సారంగాపూర్‌ మండలం పెంబట్ల, గొల్లపల్లి, మెట్‌పల్లి మండలం చింతలపేట, మల్యాల మండలం రాంపూర్‌, రాయికల్‌ గ్రామాల్లో యువ రైతులు మాత్రం సాధారణ పంటలను ఓవైపు సాగు చేస్తూనే.. మరోవైపు 10–20 గుంటల్లో పూలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. బంతి పూలకు పండుగల సీజనైన బతుకమ్మ, దసరా, నవరాత్రోత్సవాలు, దీపావళి పూజలు, సంక్రాంతి, అయ్యప్ప స్వాముల పూజల సందర్భంగా మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ మార్కెట్‌ను పసిగట్టిన వీరంతా రెండేళ్లుగా బంతి పూల సాగుకు ఉపక్రమిస్తున్నారు. నమ్మకమైన ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన విత్తనాలను కొనుగోలు చేసి నారుగా పోశారు. తర్వాత 15–20 రోజుల మధ్యలో ప్రధాన భూమిలో నాటుతారు.

ప్రోత్సాహం..

పూల సాగుకు ఆసక్తి చూపే రైతులకు ఉద్యాన శాఖ సైతం ప్రోత్సాహమందిస్తోంది. ఎకరా బంతి పూల సాగుకు రూ.8వేలు, లిల్లీ పూల సాగుకు రూ.40వేల సబ్సిడీ ఇస్తున్నారు. బంతి పూలు సాగు చేసే భూమిని ట్రాక్టర్‌తో బాగా దున్నించి, పశువుల ఎరువుతోపాటు కోళ్ల ఎరువు వేసి బెడ్లు తయారు చేస్తారు. మొక్కల వరుస వరుసకు మధ్య 3 ఫీట్లన్నర, చెట్టు చెట్టుకు మధ్య ఫీట్‌ ఉండేలా నారు మొక్కలను అప్పటికే సిద్ధం చేసిన బెడ్‌పై నాటుతారు. 2–3 రోజులకోసారి డ్రిప్‌ ద్వారా సాగు నీరందిస్తారు. చాలామంది రైతులు కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్‌ షీట్‌ను ఉపయోగిస్తారు. ప్రతీ మొక్కకు కొమ్మలు విపరీతంగా వచ్చేందుకు 20–25 రోజుల సమయంలో నిటారుగా పెరిగే పెద్ద కొమ్మలను కట్‌ చేస్తారు.

మార్కెట్లోకి పూలు..

బంతి పూల సాగుకు అవసరమైన అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో.. వారం రోజుల నుంచి బంతి పూలు మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది. పూచిన పూలను జగిత్యాల, కరీంనగర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి మార్కెట్లకు తరలిస్తున్నారు. మొక్కలు త్వరగా ఎదిగి కాపునిచ్చేందుకు వారం రోజులకోసారి డీఏపీ వేస్తున్నారు. మొక్క పెరిగినకొద్దీ పచ్చ దోమ, పచ్చ పురుగులు ఎక్కువ కావడంతో.. వాటి నివారణ కోసం రెండుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తారు. ప్రస్తుతం నాలుగైదు రోజుకోసారి క్వింటాళ్ల చొప్పున బంతి పూలు వస్తుండగా.. దీపావళి వరకు టన్నులకొద్ది బంతి పూలు మార్కెట్లోకి వచ్చె అవకాశముంది.

పూల అమ్మకానికి సోషల్‌ మీడియా

బంతి పూల అమ్మకానికి సోషల్‌ మీడియా వేదికగా చేసుకున్నారు. పూలు తెంపే రెండు, మూడు రోజుల ముందు విస్తృతంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలో రూ.60 చొప్పున రైతుల తోటల వద్దకే వచ్చి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు విక్రయించే పూలు ఇతర ప్రాంతాల నుంచి వస్తుండడం, రవాణాలో ఆ పూలు నలిగిపోతుండడంతో.. స్థానికంగా సాగు చేసే పూలు తాజాగా ఉండి వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. పూలు అవసరముండే వినియోగదారులు బంతి తోటల వద్దకే పరుగులు తీస్తున్నారు. ఆర్డర్లు లేని సమయంలో ఉదయం పూట జగిత్యాల మార్కెట్‌కు తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కువ మొత్తంలో పూలు వస్తే హోల్‌సేల్‌గా వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement