
రూ.300 కోసమే మర్డర్
జగిత్యాలక్రైం: జగిత్యాలలో ఈనెల 14న జరిగిన ఆటో డ్రైవర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆటో అద్దె రూ.300 చెల్లించే విషయంలో గొడవ జరగడంతో ఆటో డ్రైవర్‌ను హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణంలోని సుతారిపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయిమోద్దీన్ ఈనెల 14న రాత్రి పాతబస్టాండ్‌లో ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. బిహార్‌కు చెందిన దర్శన్‌సాహ్ని, సునీల్ సాహ్ని, పంకజ్‌కుమార్ ఆటో డ్రైవర్ నయిమోద్దీన్ వద్దకు వచ్చారు. వారు పనిచేసే జగిత్యాల రూరల్ మండలం హైదర్‌పల్లి శివారులోని రైస్‌మిల్లుకు తీసుకెళ్లాలని సూచించారు. రూ.300కు కిరాయి కుదుర్చుకున్నారు. పొలాస శివారుకు వెళ్లేసరికి ఆటోకిరాయి చెల్లింపు విషయంలో డ్రైవర్‌తో గొడవ జరిగింది. పంకజ్‌కుమార్ ఆటో దిగి వెళ్లిపోయాడు. దర్శన్‌సాహ్ని, సునీల్ సాహ్ని కలిసి గుడ్డపేలుకతో నయిమోద్దీన్ గొంతు బిగించి, కింద పడేశారు. సునిల్ సాహ్ని బండరాయితో నయిమోద్దీన్ ముఖంపై బాదాడు. చనిపోయాడని నిర్దారించుకుని, మృతదేహాన్ని పక్కనున్న నీటిలో పడేశారు. అక్కడినుంచి హైదర్‌పల్లి శివారులోని రైస్‌మిల్లుకు వెళ్లిపోయారు. మృతుడి సోదరుడు ఇసాక్‌ఖాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు సీసీపుటేజీల ఆధారంగా పంకజ్‌కుమార్‌ను విచారించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో హైదర్‌పల్లి రైస్‌మిల్లులో ఉన్న దర్శన్‌సాహ్ని, సునీల్‌సాహ్నిను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్, ఏఎస్సై అజీమోద్దీన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
● ఆటో డ్రైవర్ హత్యకేసు ఛేదన
● ఇద్దరు బిహారీల అరెస్టు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్