
ఎస్జీఎఫ్ షెడ్యూల్ ఖరారు
15 నుంచి జిల్లాస్థాయిలో ప్రారంభం కానున్న పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: పాఠశాలల క్రీడాసమాఖ్య క్రీడాసందడి మొదలైంది. మండల, జోన్‌స్థాయిలో పోటీలు అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా మైదానాలు విద్యార్థులు, క్రీడాకారులతో కిక్కిరిసిపోతున్నాయి. పలు మండలాల్లో నిర్వహించిన మండలస్థాయి పోటీలు జాతరలను సైతం మైమరపింపజేసేలా జరుగుతుండడం విశేషం. ఈనెల 14 వరకు అన్ని మండలాల్లో క్రీడాపోటీలు ముగియనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పాఠశాలల క్రీడాసమాఖ్యల కార్యదర్శులు క్రీడల నిర్వహణపై ఇటీవల సమావేశమయ్యారు. ఏ జిల్లాలో ఏఏ క్రీడల్లో పోటీలను నిర్వహించాలో, జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో నేరుగా పోటీలను నిర్వహించే క్రీడలపై ఓ కొలిక్కి వచ్చారు. ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడల్లో మొదటగా జిల్లాలో పోటీలను నిర్వహించి.. తదనంతరం ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. మిగిలిన క్రీడల్లో నేరుగా ఉమ్మడి జిల్లా పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగే క్రీడల జాబితాను ఎస్జీఎఫ్ కార్యదర్శులు వేణుగోపాల్(కరీంనగర్), లక్ష్మణ్(పెద్దపల్లి), శ్రీనివాస్(రాజన్న సిరిసిల్ల), చక్రాధర్(జగిత్యాల) ప్రకటించారు.
అండర్–14, 17..
పాఠశాల స్థాయిలో అండర్–14, 17 బాలబాలికల విభాగాల్లో జరగనున్న ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు ఆగస్టు చివరి వారం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నేటికి కూడా పలు మండలాల్లో మండలస్థాయి పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించడానికి ఎస్జీఎఫ్ కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15న కరీంనగర్‌లో అండర్–17 వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం కానుండగా.. మిగిలిన జిల్లాల్లో కూడా జిల్లాస్థాయి పోటీలు పలు క్రీడల్లో జరగనున్నాయి.
జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కరాటే అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు
● కరీంనగర్ జిల్లాలో అథ్లెటిక్స్, అర్చరీ, బేస్‌బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కళారియపటు, కురాష్, మల్లాకంబ్, మోడరన్ పెంటాథ్ల్లాన్, నెట్‌బాల్, రగ్బీ, సెపక్ తక్రా, షూటింగ్, స్కేటింగ్, సాఫ్ట్‌బాల్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, యోగాసనా(అండర్–14, 17).
● పెద్దపల్లి జిల్లాలో స్విమ్మింగ్, టెన్నిస్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, కరాటే(అండర్–14, 17), క్రికెట్, కబడ్డీ, వాలీబాల్(అండర్–14).
● జగిత్యాల జిల్లాలో తైకై ్వండో, బాస్కెట్‌బాల్, చెస్, ఖోఖో(అండర్–14, 17).
● రాజన్న సిరిసిల్ల జిల్లాలో హ్యాండ్‌బాల్(అండర్–14, 17), వాలీబాల్, క్రికెట్, కబడ్డీ(అండర్–17).
వర్షాలతో అంతరాయం
జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో వర్షాలు భారీస్థాయిలో పడడంతో పోటీలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే మండలస్థాయి పోటీలు పూర్తి కావస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ మొదటివారంలో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తాం. ఉమ్మడి జిల్లా పోటీలకు కూడా సిద్ధంగా ఉన్నాం.
– చక్రధర్,
ఎస్జీఎఫ్ కార్యదర్శి, జగిత్యాల