
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటకు చెందిన మెట్టు శ్రీనివాస్(50)సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శరీరం కుళ్లిపోయి, దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతుని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మిస్తుండడంతో శ్రీనివాస్ స్వగ్రామం గంభీరావుపేటలో ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
బోయినపల్లి (చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ముకుంద అనిల్ (22 ) ఏడాదిగా ఒంటరిగా ఉంటూ కిరాణషాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం ఇంట్లో ఇనుప పైపుకి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
పోక్సో కేసులో పదేళ్ల జైలు
పెద్దపల్లిరూరల్: ఓ బాలికపై అఘాయిత్యం చేసిన కేసులో మందల రవికి పదేళ్ల కఠిన కారగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శుక్రవారం తీర్పునిచ్చారని సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 2017 జనవరి 21న పాల పాకెట్ తీసుకొచ్చేందుకు ఇంటినుంచి వెళ్లిన తన కూతురు చాలాసేపటి వరకు ఇంటికి రాలేదు. ఎదురుగా వెళ్లిన ఆమెను ఇంటివద్ద దిగబెడతానని నమ్మించి రవి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. పూర్వాపరాలపై విచారణ జరిపి వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో రవికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అలాగే లీగల్ సర్వీసెస్ అధారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.
ఉరేసుకుని యువకుడు మృతి
వెల్గటూర్: నాలుగేళ్ల క్రితమే తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, అదే అనారోగ్యం కొడుకునూ బాధించింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి కడుపు కోత మిగిల్చాడు. ఈ సంఘటన వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంగ శరత్‌కుమార్(23) గ్రామంలో హార్వెస్టర్ నడిపిస్తుంటాడు. కొంతకాలంగా ఛాతినొప్పితో బాధపడుతున్నారు. పలుమార్లు హాస్పిటల్‌కు వెళ్లినా సమస్య తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో తల్లి రాజేశ్వరి గుండెలవిసేలా రోదించింది. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
గంజాయి విక్రేతల రిమాండ్
వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డిపే ట సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మండలంలో ని గర్జనపల్లికి చెందిన భరత్, దినేశ్ వీర్నపల్లిలో గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై వేముల లక్ష్మణ్ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు.