
పేట్రేగిపోతున్న సైబర్‌మోసగాళ్లు
గోదావరిఖని: ప్రపంచం సెల్‌ఫోన్ గుప్పిట్లోకి వచ్చింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌షాపింగ్, ఆన్‌లైన్ టూరిజం, ఆన్‌లైన్ గేమింగ్.. ఇలా ఒక్కటేమిటి ప్రతీది సెల్‌ఫోన్ ద్వారానే జరుగుతోంది. సెల్‌ఫోన్ ఎంత సౌకర్యంగా ఉందో, అప్రమత్తంగా లేకుంటే అదేస్థాయిలో మోసపోయే ప్రమాదమూ ఉంది. రోజుకో తీరులో సైబర్‌మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సెల్‌ఫోన్ లేకుంటే క్షణం కూడా గడవని ఈరోజుల్లో.. ఇదే సెల్‌ఫోన్ ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేనివారు. డబ్బు అత్యవసరం ఉన్నవారిని టార్గెట్ చేసుకొంటున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాదు విద్యావంతులు సైతం సైబర్‌గాళ్ల వలలో చిక్కుతున్నారు. కొద్దిరోజులుగా బాధితులు పోలీస్‌కు ఫిర్యాదు చేయడం అధికంగా అవుతోంది.
అపరిచిత కాల్స్‌కు స్పందిస్తే..
అపరిచిత కాల్స్‌కు స్పందించినా, గుర్తుతెలియని లింక్స్ క్లిక్ చేసినా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్లే. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి. ఒకరు ఫోన్‌చేసి ఆధార్ అప్‌డేట్ చేయాలి.. లింక్ పంపిస్తున్నామంటూ ఖజానా ఖాళీ చేస్తారు. మరొకరు వీడియోకాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడించి న్యూడ్‌గా రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేసి మరీ డబ్బులు గుంజుతారు. ఇంకొకరు ఓటీపీ అడిగి ముంచుతారు. ఇలాంటి సైబర్ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలాంటి నేరాల్లో కొన్నింటిపైనే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొందరు పరువు పోతుందనో, ఇరుగుపొరుగువారిలో చులకన అవుతామనే ఉద్దేశంతో మోసపోయామని తెలిసినా ఎవరికీ చెప్పకుండా లోలోపల మదనపడుతున్నారు.
ఏపీకే ఫైళ్లు పంపి ఇలా..
ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) పైళ్లను వాట్సప్ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్‌చేసి ఓకే అని క్లిక్ చేసేవారి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. ఈ విషయం తెలియనివారు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సొమ్ము పంపితే వెంటనే సైబర్ నేరగాళ్లు పిన్ నంబర్ తెలుసుకొని నిమిషాల్లో బాధితుడి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్ చేసిన ఫోన్ డివైస్ డిస్‌ప్లే సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీంతో నేరగాళ్లు ఆ ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లకు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. దీంతో తమకు తెలిసిన వ్యక్తి నుంచే మేసేజ్ వచ్చిందని భావించిన ఇతరులు ఆఏపీకే ఫైళ్లలింక్‌ను ఓపెన్ చేయటంతో ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. పీఎం కిసాన్ యోజన, ఎస్‌బీఐ రివార్డ్స్, పెళ్లికార్డులు, బర్త్‌డే ఇన్విటేషన్ తదితర లింక్‌ల పేరిట పంపుతూ బ్యాంకు ఖాతాల నుంచి నగదు లాగేస్తున్నారు.
జాబ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్..
జాబబ్ పేరుతో ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించమని చాలామందిని మోసం చేస్తున్నారు. ఇలాగే స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆన్‌లైన్‌లో లాభాలు చూపిస్తూ పెద్దమొత్తంలో పెట్టిబడి పెట్టిన తర్వాత చేతులెత్తేస్తున్నారు. కొందరికి ఓటీపీ పంపి దాన్ని చెప్పమని ఆ తర్వాత ఖాతా ఖాళీ చేస్తున్నారు. మీ ఆధార్‌కార్డ్ ద్వారా ఫ్రాడ్ జరిగిందని వెంటనే డిటేల్స్ చెప్పాలని ఒత్తిడి చేసి ఆ తర్వాత సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
కొత్త పంథాలో ఆన్‌లైన్ మోసాలు
చలాన్ల పేరుతో గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్
ఓపెన్‌చేస్తే ఖాతాలోంచి మాయమవుతున్న డబ్బు
బలవుతున్న సామాన్యులు, అమాయకులు
రెండేళ్లలో జరిగిన సైబర్ మోసాలు
ఏడాది ఫిర్యాదులు నష్టం(రూ.లలో) రికవరీ(రూ.లలో)
2024 1,406 3,91,20,408 11,02,566
2025 1,206 2,75,00,542 22,35,689
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తతతోనే ఆన్‌లైన్‌మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రధానంగా ఏపీకే ఫైల్స్ పంపి వాటిని ఓపెన్ చేస్తే ఉన్న సొమ్మంతా మాయం చేస్తున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని లింక్‌లు పంపించి ఆ తర్వాత సొమ్ము రాబట్టి మోసం చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే భారీలాభాలు ఇస్తామని, లాభాలను ఆన్‌లైన్‌లోనే చూపించి పెద్దమొత్తంలో నొక్కేస్తున్నారు. దీనిపై పోలీసుశాఖ అవగాహన కల్పిస్తోంది. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలి. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం

పేట్రేగిపోతున్న సైబర్‌మోసగాళ్లు