
● ప్రభుత్వ బడులకు రేటింగ్ ● ఆరు అంశాల ఆధారంగా నిర్ణయం
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో మెరుగైన సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించాయి. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల ఆరోగ్యాలు బాగుంటాయని, వారి ఆరోగ్యాలు బాగుంటే నాణ్యమైన చదువు అందుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకు పాఠశాలలకు ఏటా ప్రత్యేక పురస్కారాలు అందించింది. ఐదేళ్లుగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ విద్యా సంవత్సరం ప్రారంభించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. మూత్రశాలలు, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం, నీటివసతి తదితర అంశాలను పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నారు. 60అంశాల ఆధారంగా 1–5 రేటింగ్ కేటాయించనున్నారు. అత్యుత్తమ రేటింగ్ సాధించి, జాతీయస్థాయికి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష నజరానా అందించనుంది.
జిల్లాలో 651 పాఠశాలలు
జిల్లావ్యాప్తంగా 651 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 35వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మనఊరు– మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల అమలుతో చాలా పాఠశాలల రూపురేఖలు మారాయి. కిచెన్ గార్డెన్ల వినియోగం, మరుగు దొడ్ల నిర్వహణ మెరుగుపడ్డాయి. ఇలాంటి పాఠశాలల్లో ఆరు ప్రధానాంశాలను నమోదు చేసి, దాన్నిబట్టి రేటింగ్ ఇస్తారు. మొత్తం 60 ప్రశ్నలకు 125 మార్కులు సాధిస్తే అయిదు స్టార్స్ ఇస్తారు. నీటి సంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, చేతుల శుభ్రతకు 27, మొక్కలు తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21, విద్యుత్తు పొదుపు, సోలార్ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు 21 మార్కులు ఉంటాయి. అయిదు రేటింగ్స్ సాధించిన పాఠశాలలకు కేంద్రం పురస్కారాలు అందించే అవకాశం ఉంది. పాఠశాలలను అభివృద్ధి చేసి, నిర్వహణలో తమవంతు కృషి చేస్తున్న హెచ్‌ఎంలు చొరవ తీసుకొని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆరు అంశాల ఆధారంగా పాఠశాలల రేటింగ్‌ను నిర్ణయిస్తారు.
జాతీయస్థాయి వరకు పోటీ
స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) కార్యక్రమంపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈనెల 4 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులు వారి పాఠశాలల వివరాలు ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ లేదా ఎస్‌హెచ్‌వీఆర్.ఎడ్యుకేషన్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో యూడైస్ కోడ్‌తో లాగిన్ అయి నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి వరకు పోటీ పడేందుకు ఆరు అంశాల ఆధారంగా రేటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.
స్వచ్ఛ పాఠశాలలే లక్ష్యంగా..