
● బల్దియా పరిధిలో శానిటేషన్ జవాన్ల అక్రమ వసూళ్లు ● ఏళ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో శానిటేషన్ జవాన్ల అక్రమ వసూళ్ల దందా యథేచ్చగా సాగుతోంది. చెత్తనెపంతో వ్యాపారుల నుంచి, స్వచ్ఛ ఆటోల పేరిట ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతమంది అధికారుల, మాజీ కార్పొరేటర్ల అండతో ఏళ్లుగా ఒకే డివిజన్‌లో తిష్టవేసిన జవాన్ల స్థానచలనం కష్టంగా మారింది. నగరపాలకసంస్థ పరిధిలోని 66 డివిజన్లకు గాను 61మంది జవాన్లు ఉన్నారు. అందులో 9మంది రెగ్యులర్ కాగా.. మిగితా వారు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన కొనసాగుతున్నారు. ఏళ్లక్రితం 22 మందిని కౌన్సిల్ తీర్మాణం మేరకు తీసుకోగా, తరువాత మరో 24 మంది చేరారు. ఇటీవల విలీన ప్రాంతాలకు సంబంధించి అప్పటికే ఉన్న ఆరుగురిని కొనసాగిస్తున్నారు. కొంతమందికి రెండు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. వీరంతా ప్రతిరోజు తమ డివిజన్ల పరిధిలో కార్మికులతో చెత్తను తొలగించడం, తరలించడాన్ని పర్యవేక్షిస్తుంటారు.
కలెక్షన్ చెత్త కాదు.. మనీ
ఇళ్లు, వీధులు, రోడ్లను శుభ్రంగా ఉంచేందుకు చెత్త కలెక్షన్ చేయించాల్సిన జవాన్లు మనీ కలెక్షన్‌పై దృష్టిపెట్టారు. నగరపాలకసంస్థకు రావాల్సిన యూజర్ చార్జీలను కాజేస్తూ, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్‌మాల్స్ నుంచి ప్రతినెల రూ.వేలు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ సంస్థల నుంచి బల్దియా పేరిట యూజర్‌చార్జీలు వసూలు చేసి చెత్తను డంప్‌యార్డ్‌కు తరలించాల్సి ఉంటుంది. బల్దియాకు రావాల్సిన యూజర్‌చార్జీలను పక్కనపెట్టి, సొంతంగా వసూలు చేస్తున్నారు. తద్వారా బల్దియాకు నష్టం వాటిల్లుతోంది. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలు నగరపాలకసంస్థకు 18 ఉండగా, డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద బల్దియా వాయిదాలు చెల్లించే ప్రైవేట్ ఆటోలు 70 ఉన్నాయి. ఇందులో ఇంటింటికి నెలకు వసూలు చేసే రూ.50 యూజర్ చార్జీలు ప్రైవేట్ ఆటోల ఓనర్లకు, బల్దియా ఆటోలైతే, నగర పాలకసంస్థకు చెందాలి. నెలవారి యూజర్ చార్జీలను కూడా జవాన్లు కాజేస్తున్న సంఘటనలు ఉన్నాయి.
ఏళ్లుగా ఒకే చోట తిష్ట
జవాన్లకు స్థానచలనం లేకపోవడం, ఏళ్లుగా ఒకే చోట తిష్టవేయడంతో తమ పరిచయాలను ఆర్థిక, రాజకీయాలకు మళ్లిస్తున్నారు. కొంతమంది మాజీ కార్పొరేటర్లకు రాజకీయంగా లబ్ధి చేకూర్చి, తమ అక్రమాలకు వత్తాసు పలికేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత స్పెషల్ ఆఫీసర్ పాలనలో డివిజన్‌లో జవాన్ల పాత్ర అధికారికంగా కీలకం. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వివాదాస్పదమవుతున్నారు. గతేడాది జవాన్లకు స్థానచలనం కలిగిచేందుకు రంగం సిద్ధం చేసినా, ప్రజాప్రతినిధులు నుంచి వచ్చిన ఒత్తిళ్లతో సాధ్యపడలేదు. ఇప్పటికై నా జవాన్ల అక్రమ దందాపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరముందని నగర ప్రజలు కోరుతున్నారు.

● బల్దియా పరిధిలో శానిటేషన్ జవాన్ల అక్రమ వసూళ్లు ● ఏళ్