
కమ్యూనిటీ హాల్ కబ్జాపై విచారణ
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని గణేశ్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్ కబ్జా వ్యవహారంపై నగరపాలకసంస్థ అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం పట్టణ ప్రణాళిక విభాగం ఇన్‌చార్జీ ఏసీపీ వేణు ఆధ్వర్యంలో గణేశ్‌నగర్‌లోని భవనాన్ని సందర్శించి విచారించారు. గణేశ్‌నగర్‌లో సంవత్సరాల క్రితం 242 గజాల స్థలంలో కమ్యూనిటీ భవనం నిర్మించారని, కాని మాజీ ప్రజాప్రతినిధి ఒకరు ఈ భవనాన్ని కబ్జా చేశారంటూ బీజేపీ నాయకుడు డి.శ్రీధర్ ఇటీవల నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ వేణు ఆధ్వర్యంలో వార్డు అధికారి మౌనిక, ఆర్‌ఐ, టీపీబీవోలు కమ్యునిటీ హాల్ భవనాన్ని సందర్శించారు. భవనానికి సంబంధించిన డాక్యుమెంట్లు తమకు అందచేయాలంటూ సదరు యజమానికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఫిర్యాదు దారుడిని కూడా సంబంధించిన డాక్యుమెంట్లు అందచేయాలని సూచించారు. కాగా డాక్యుమెంట్లు చూపించిన తర్వాత, ఆక్రమణ నిజమని తేలితే చర్యలు తీసుకొంటామని అధికారులు తెలిపారు.