
‘మహాలక్ష్మి’ తెచ్చిన తంటా
కరీంనగర్ కార్పొరేషన్: ‘మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుంచి 55 ఏళ్ల మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం అందించే దిశగా మధుగార్డెన్‌లో పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు’.. అంటూ వచ్చిన వాట్సప్ మెసేజ్ గందరగోళాన్ని సృష్టించింది. నగరంలోని మధుగార్డెన్‌లో మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పోస్టాఫీసులో అకౌంట్ తీసుకోవాలంటూ స్థానిక డివిజన్ల వాట్సప్ గ్రూప్‌ల్లో ఓ పార్టీ నాయకులు మెసేజ్‌ను గురువారం విస్తృతంగా ప్రచారం చేశారు. షాహాబ్‌స్ట్రీట్, అమీర్‌నగర్‌లకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో మధుగార్డెన్‌కు చేరుకున్నారు. పోస్టాఫీసు అకౌంట్లు తీసుకున్నారు. నెలకు రూ.2500 ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేయకపోగా, డివిజన్‌లో మాత్రం దరఖాస్తులు తీసుకోవడమేమిటంటూ ఇతర పార్టీల నాయకులు ఆరా తీశారు. దీంతో పోస్టాఫీసుకు సంబంధించి అకౌంట్లను పెంచుకోవడంలో భాగంగా ఇది జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.