
విపత్తు వేళ ‘ఆపద మిత్ర’లు కీలకం
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: ప్రకృతి వైఫరీత్యాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రెవెన్యూశాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో 142మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లకు బీసీ స్టడీ సర్కిల్లో 12రోజులపాటు ఆపదమిత్ర శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ వలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన లేకపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల ను ఎదుర్కొనేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వరంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లకు మొదటి విడతలో ఆపద మిత్ర శిక్షణ ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లు విజ యవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క పాటు, అగ్నిప్రమాదం, సీపీఆర్, షార్ట్‌సర్క్యూట్, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆపదమిత్ర వలంటీర్లు ముందుండి ప్రజల ప్రాణాలను రక్షించాలన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.