
కొడుకు చనిపోయాడనే బెంగతో తండ్రి ఆత్మహత్య
ముత్తారం(మంథని): చేతికి అందిన కొడుకు చనిపోయాడనే బెంగతో మారం రాజిరెడ్డి(55) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని కాసార్లగడ్డలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మారం రాజిరెడ్డి వ్యవసాయ కూలీగా పని చేసుకుంటున్నాడు. వచ్చేఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఇతడి కొడుకు రమేశ్‌రెడ్డి గతేడాది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. అప్పట్నుంచి తీవ్రమనోవేదనతో ఉంటున్నాడు. తన కన్నకొడుకు మృతి చెందడం బాధిస్తోందని తన భార్యకు తరచూ చెప్తూ ఏడ్చేవాడు. ఈక్రమంలో కొడుకు లేడనే ఆవేదనతో ఈనెల 15న రాజిరెడ్డి పురుగుల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన భార్య పద్మ నిద్రలేపేందుకు యత్నించగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పాడు. సమీప బంధువులకు సమాచారం అందించిన పద్మ వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
అప్పుల బాధతో వివాహిత..
ధర్మపురి: చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురైన ఓ మహిళ నిద్రమాత్రలు మింగగా.. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ధర్మపురికి మెరుగు గంగలక్ష్మికి సిరిసిల్లకు చెందిన సంతోష్‌తో గతంలోనే వివాహమైంది. వీరికి కూతురు సంతానం. గంగలక్ష్మి అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతూ.. తెలిసిన వారి వద్ద అప్పు చేసింది. అప్పు ఇచ్చిన వారు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయగా.. మనస్తాపానికి గురైన గంగలక్ష్మి (40) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగింది. కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. భర్త సంతోష్ సిరిసిల్లలో సాంచాల పని చేస్తుంటాడని తెల్సింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన గాండ్ల సత్యం (53)అనే సింగరేణి ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. తన కూతురు ముద్దసాని లావణ్యను పెద్దపల్లిలోని కాలేజీలో చేర్పించేందుకు బైక్‌పై వస్తున్నాడు. అప్పన్నపేట శివారులో డివైడర్‌ను అదుపుతప్పి ఢీకొన్నాడు. ఆ తర్వాత డివైడర్ ఆవతల ఉన్న రోడ్డుపైకి పడ్డాడు. ఇంతలోనే అటుగా వేగంగా వస్తున్న లారీ సత్యం పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. వెంట ఉన్న కూతురు డివైడర్‌పై పడగా గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మల్లేశ్ తన సిబ్బందితో వెళ్లి గాయపడ్డ లావణ్యను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

కొడుకు చనిపోయాడనే బెంగతో తండ్రి ఆత్మహత్య