
బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
గంగాధర(చొప్పదండి): పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో, తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లి మాజీ సర్పంచ్ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మిదేవిపల్లి గ్రామానికి తాళ్ల విజయలక్ష్మి గత జనవరి వరకు సర్పంచ్‌గా కొనసాగారు. తన పదవీకాలంలో గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు రూ.12లక్షలు అప్పు తీసుకొచ్చారు. పనులు పూర్తిచేసి, రికార్డులు చేయించి, బిల్లులు పెట్టినా నిధులు మంజూరు కాలేదు. పదవీకాలం ముగిసినా బిల్లులు రాలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని విజయలక్ష్మి భర్త రవి ఆవేదన చెందాడు. సోమవారం సాయంత్రం పురుగుల మందుతాగాడు. కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. మంగళవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బాధితుడిని పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.