
మితిమీరిన వేగం.. డ్రంక్ అండ్ డ్రైవ్
గోదావరిఖని: అతివేగం.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం.. స్పోర్ట్స్ బైక్‌లపై విన్యాసాలు ప్రదర్శించడం.. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు విస్మరించడంతో అమూల్యమైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అంతేకాదు.. కొంతకాలంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది జూన్ 30వ తేదీ వరకు జరిగిన 199 ప్రమాదాల్లో 75 మంది మృతి చెందారు. 22 మంది తీవ్రంగా, 204 మంది స్వల్పంగా గాయపడ్డారు.
బ్లాక్‌స్పాట్ల వద్దే ప్రమాదాలు..
జిల్లాలోని పెద్దపల్లి మండలం దుబ్బపల్లిలో ప్రారంభమయ్యే రాజీవ్ రహదారి గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వరకు సుమారు 50 కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనిపై పలుచోట్ల పోలీసు యంత్రాంగం ఆరేళ్ల క్రితమే బ్లాక్‌స్పాట్లు గుర్తించింది. వీటివద్దే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్ విభాగానికి అప్పగించారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవడంతో కొంతమేర ప్రమాదాలు తగ్గినా.. సూచిక బోర్డులు కనిపించకపోవడం, బ్లాక్ స్పాట్ల సమాచారం తెలియకపోవడంతో అతివేగంతో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.
తెల్లవారుజామునే అధికం..
రాజీవ్ రహదారిపై తెల్లవారుజామునే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నిద్రలేక, అలసిపోయినా డ్రైవింగ్ చేయడంతో డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటున్నారని, ఈక్రమంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై దృష్టి..
ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం తాగి దొరికితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. రెండోసారి పట్టుబడితే కోర్టులో హాజర్చుతున్నారు. దీంతో నిందితులకు జైలు శిక్ష పడుతోంది. అయితే, గతేడాది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ 6,725 మంది పట్టుపడగా, అందులో 3,352 మంది నుంచి రూ.44.14 లక్షల జరిమానా వసూలు చేశారు.
పెరుగుతోన్న రోడ్డుప్రమాదాలు
గోల్డెన్ అవర్‌లో అందని వైద్యసాయం గాల్లో కలుస్తున్న ప్రాణాలు
కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్‌లో ఈనెల 9న ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఆర్టీసీ డ్రైవర్ తోట శ్రీకాంత్(30) దుర్మరణం చెందాడు.
విలేజ్ రామగుండంలో ఈనెల 7న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ సూపర్ వైజర్ అంబాల రాజశేఖర్(50) తీవ్రగాయాలతో చనిపోయాడు.
యైటింక్లయిన్‌కాలనీ సింగరేణి అధికారుల క్వార్టర్ల సమీపంలో జూన్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి అధికారి ఉప్పటి రమేశ్‌బాబు(37) అక్కడికక్కడే మరణించాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కిందపడడంతో ప్రమాదం జరిగింది. హెల్మెట్‌ఉంటే బతికేవాడని స్థానికులు తెలిపారు.
రాజీవ్‌రహదారిపై బ్లాక్‌స్పాట్లు ఇవే..
రామగుండం తహసీల్లార్ కార్యాలయం ఎదుట
ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్‌గేట్, మేడిపల్లి సెంటర్, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ అంబేడ్కర్ టీ జంక్షన్
సింగరేని బీ –గెస్ట్‌హౌస్ మూలమలుపు, మిలీయం కార్టర్స్ సమీపంలోని గంగానగర్ ఫ్‌లైఓవర్
మల్యాపల్లి ఐవోసీ, బుగ్గరోడ్డు, ధర్మారం ఎక్స్‌రోడ్డు, అప్పన్నపేట, మంథని ప్లైఓవర్
చిన్నకల్వల, సుల్తానాబాద్ బస్టాండ్, కాట్నపల్లి క్రాస్‌రోడ్డు, గర్రెపల్లి, దుబ్బపల్లి
నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు
ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు
2022 127 53 262
2023 113 65 300
2024 145 57 342
2025 75 22 204
(జూన్ వరకు)
అతివేగమే కారణం
అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొంతకాలంగా ద్విచక్రవాహనాల ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారురెండోసారి పట్టుబడితే కోర్టు జైలు శిక్ష విధిస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం.
– శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ, రామగుండం

మితిమీరిన వేగం.. డ్రంక్ అండ్ డ్రైవ్