
సమస్యల పరిష్కారంలో రైల్వేశాఖ విఫలం
రామగుండం: ఎగుమతులతో రూ.కోట్ల ఆదాయం సాధిస్తున్న రైల్వేశాఖ.. రైల్వేగేట్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రైల్వేగేట్‌తో ఇరువైపులా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రైల్వేగేట్ల రహిత మార్గంపై దృష్టి పెడుతున్నామని చెబుతున్న రైల్వేశాఖ.. కుందనపల్లిలో ఐదు రైల్వేట్రాక్‌లు ఉన్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒక రైలు రాకపోకలు సాగిస్తుండడంతో గేటు ఎప్పుడూ మూసే ఉంటుందని, గేటుతీసే సమయం తగ్గిపోవడంతో ప్రజల భాదలు వర్ణనాతీతమన్నారు. పెద్దపల్లి, కరీంనగర్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు ఇదే రహదారి గుండా రాకపోకలు సాగిస్తుండడంతో రైలు సమయానికి నాలుగు గంటల ముందు ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై రైల్వేశాఖ స్పందించి తక్షణమే భూగర్భ, ఫ్‌లై ఓవర్ నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే ప్రజాసంబంధాల ప్రతినిధి అనుమాస శ్రీనివాస్, సజ్జత్ తదితరులు ఉన్నారు.
తెలంగాణకు 60 శాతం యూరియా కేటాయించాలి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ సీజీఎం రాజీవ్ ఖుల్బే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కర్మాగారంలోని మెయిన్ కంట్రోల్ యూనిట్‌ను పరిశీలించారు. యూరియా ఉత్పత్తి, రవాణా, వివిధ రాష్ట్రాల కేటాయింపుల వివరాల గురించి సీజీఎం ఆయనకు వివరించారు. అనంతరం వంశీకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణ రాష్ట్రానికి 60 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. గతేడాది 60 శాతం కేటాయించగా ప్రస్తుతం 30 శాతానికి తగ్గించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియాని కేటాయిస్తోందని ఆరోపించారు. కార్మికుల సమస్యలు, వేతనాలు, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. నాయకులు పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, తొగరు తిరుపతి, సాగంటి శంకర్, వీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
గేట్ల రహిత రైల్వేట్రాక్ ఏర్పాటుపై శ్రద్ధ వహించాలి
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ