
సర్కారు వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
జమ్మికుంట: సర్కారు ఆస్పత్రిలో వైద్యం సామాన్యుల ప్రాణాలమీదకు తెస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని, సద్వినియోగం చేసుకోవాలని పాలకులు, అధికారులు ఓ పక్క ప్రచారం చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం, వైద్యుల పర్యవేక్షణ లేనితనం శాపంగా మారుతోంది. జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు ఇవ్వగా.. సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలోని గణేశ్‌నగర్ చెందిన హరీశ్– కావ్య దంపతులు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగులు. కావ్య ప్రస్తుతం ఐదునెలల గర్భిణి. ఏఎన్‌ఎం సూచనల మేరకు ప్రతీనెల జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీన నెలవారీ పరీక్షలకు ఆస్పత్రికి వచ్చింది. వైద్యురాలు ప్రణీత మల్టీ విటమిన్, ఐరన్ ట్యాబ్లెట్లు రాశారు. ఆస్పత్రి ఫార్మసీలో మందులు తీసుకుని వాడుతోంది. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కావ్య ముఖంపై దద్దుర్లు వచ్చాయి. కడుపునొప్పితో ఇబ్బంది పడింది. ఆదివారం ఉదయం మల్టీ విటమిన్ మందులను పరిశీలించగా జూన్ 2025న గడువు ముగిసినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో సంప్రదించగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, విధుల్లో ఉన్న నర్సు సూపరిటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడించారు. సదరు అధికారి ‘అక్కడ మందులు ఇచ్చి, వేరే మందులు తీసుకెళ్లండి’ అంటూ దబాయించాడు. దీంతో బాధితులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు మొదలు వేరే ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించడంతో వెళ్లిపోయారు. కాగా.. ఈ విషయమై సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఫార్మసిస్టుపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.
జమ్మికుంట ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు
మందులు వాడిన గర్భిణికి దద్దుర్లు, కడుపునొప్పి
ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇచ్చిన వైద్యులు

సర్కారు వైద్యం.. ప్రాణాలతో చెలగాటం

సర్కారు వైద్యం.. ప్రాణాలతో చెలగాటం