
సింగరేణి కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి మేడిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు సింగం మల్లికార్జున్‌గౌడ్ (40) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, ఎస్సై ఉదయ్‌కిరణ్ కథనం ప్రకారం.. మల్లికార్జున్‌గౌడ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మల్లికార్జున్‌గౌడ్ గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య మంగ, కుమార్తెలు హర్షిణి, హసిని ఉన్నారు. మృతుడి సోదరుడు రాజబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ధర్మపురి: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పసుల అరుణ్ నెల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి.. దహన సంస్కారాల కోసం రూ.10వేలు అందించారు.
కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులకు గాయాలు
మెట్‌పల్లి: పట్టణంలో కుక్కల బెడద ప్రజలను అందోళనకు గురి చేస్తున్నాయి. స్థానిక దుబ్బవాడలో శుక్రవారం కుక్కల దాడిలో తొమ్మిది మంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం దుబ్బవాడలో ఇద్దరు బాలురు నడుచుకుంటూ వెళ్తుండగా.. పాత బస్టాండ్ వద్ద ఒక బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. గాయపడిన వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
యువకుడి గల్లంతు
గంగాధర: గంగాధర మండలం కొండన్నపల్లె శివారులోని వరద కాలువలో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండలానికి చెందిన ఎనిమిది మంది కొండన్నపల్లె శివారులోని వరదకాలువలో చేపల వేటకు వచ్చారు. ఇర్ఫాన్(30) అనే యువకుడు ప్రమాదవశాత్తు వరదకాలవలో పడి గల్లంతయ్యాడు. గంగాధర్ ఎస్సై వంశీకృష్ణ రాత్రి వరకు రెస్క్యూటీంతో గాలించినా ఆచూకీ లభించలేదు.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య