మెడికల్‌ మాఫియాకు షాక్‌! | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ మాఫియాకు షాక్‌!

Jul 13 2025 7:42 AM | Updated on Jul 13 2025 7:42 AM

మెడికల్‌ మాఫియాకు షాక్‌!

మెడికల్‌ మాఫియాకు షాక్‌!

● వేణు ఏజెన్సీ యజమానికి 14 రోజుల జైలు ● నకిలీ తీగలాగితే కదిలిన డొంక ● కరీంనగర్‌లో మొట్టమొదటి రిమాండ్‌ ● నకిలీ మూలాలపై దృష్టిపెట్టిన అధికారులు

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ మెడికల్‌ మాఫియాకు షాక్‌ తగిలింది. ఇన్నాళ్లు యథేచ్ఛగా నకిలీ మందులు తెచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన మాఫియాపై డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు తప్పని పరిస్థితుల్లో దృష్టిసారించారు. దీంతో నకిలీ మందులు తెచ్చి విక్రయిస్తున్న మెడికల్‌ వ్యాపారులకు వణుకు మొదలైంది. నగరంలో నకిలీ మందులు సరఫరా చేసే కొన్ని ఏజెన్సీల యజమానులు నకిలీ మందులను గుట్టుచప్పుడు కాకుండా చీకటిప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

సన్‌ఫార్మ కంపెనీ ఫిర్యాదుతో..

పక్షవాతం వచ్చిన రోగులకు వాడే లెవిపిల్‌–500 మందులను ప్రముఖ సన్‌ఫార్మ కంపెనీ తయారు చేస్తుండగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి అదే లేబుల్‌, అదే పేరుతో అసలును పోలిన లెవిపిల్‌–500 మందును నకిలీగా మార్చారు. నకిలీ మందులను తెప్పించి రిటైల్‌ షాపులకు అంటగట్టి దందా సాగించడంతో సన్‌ఫార్మ కంపెనీ దృష్టిపడింది. దీంతో సన్‌ఫార్మ కంపెనీ ప్రతినిధులు వేణు ఏజెన్సీలో మందులను తీసుకెళ్లి ల్యాబ్‌లో పరీక్షించగా అవి తాము తయారుచేసినవి కావని, నకిలీ మందులని తేలింది. వీటితో రోగులుకు కలిగే నష్టాన్ని గుర్తించిన సన్‌ఫార్మ కంపెనీ వెంటనే హైదరాబాద్‌లోని డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈనెల 4న వేణు ఏజెన్సీపై నకిలీ మందుల విక్ర యం కింద కేసు నమోదు చేశారు. అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు హై దరాబాద్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో వేణు మెడికల్‌ ఏజేన్సీలో నకిలీ మందుల స్టాక్‌ను సీజ్‌ చేశారు. అ ప్పటికే ఆ ఏజెన్సీపై కేసు నమోదు కావడంతో య జమాని వేణుగోపాల్‌ పరారయ్యాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకొని శుక్రవారం రిమాండ్‌ చేశారు.

మొట్టమొదటి రిమాండ్‌

ఇన్నాళ్లు డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ అధికారులు పెట్టిన కేసులన్నీ తూతూ మంత్రంగానే ఉండేవి. కేసు ఏదైనా బెయిల్‌ తీసుకొని యథేచ్ఛగా మళ్లీ దందా నడిపేవారు. కానీ, నకిలీ మందుల వ్యవహారంపై సన్‌ఫార్మా తన ల్యాబ్‌ రిపోర్టుల ఆధారంగా ఏజెన్సీ డీలర్‌షిప్‌ రద్దు చేయడంతో పాటు కేసు పెట్టడంతో నిందితుడిని కరీంనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇది కరీంనగర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు చేసిన మొదటి రిమాండ్‌ అని మెడికల్‌ వర్గాలు చెబుతున్నాయి.

అధికారుల పర్యవేక్షణ లేక..

వేణు ఏజెన్సీ యజమాని అరెస్ట్‌తో నకిలీ మందుల మాఫియాకు మొట్టమొదటి షాక్‌ తగిలింది. ఇప్పుడు అధికారులు తీసుకునే చర్యలపై, నకిలీ మందుల సరఫరా మూలాలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి పడింది. కాగా స్థానిక డాక్టర్లు, వ్యాపారులు అత్యధికంగా ఈ మాఫియా దందాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ వ్యవహారాలకు ఆజ్యం పోస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నకిలీ దందాను మామూలుగా తీసుకోకుండా కరీంనగర్‌లోని సుమారు 400 మెడికల్‌ ఏజెన్సీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలను రక్షించేలా చర్యలు తీసుకుంటారా, లేదా మళ్లీ పాత కథే పునరావృతమవుతుందా వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement